అటకెక్కిన ఆధునీకరణ పనులు

Jan 11,2024 09:04 #tungabadra

ప్రజాశక్తి -అనంతపురం ప్రతినిధి : నిత్యం దుర్బిక్ష ప్రాంతమైన అనంతపురం జిల్లాకు సాగునీటి ఆవశ్యకత చాలా అవసరముంది. అయితే ఉన్న అతి కొద్ది సాగునీటి వసతిని సక్రమంగా అందించే నీటి వ్యవస్థల్లేక రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోనున్న ఏకైక ప్రధాన ప్రాజెక్టు తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ. ఈ సిస్టమ్‌ కింద అనేక ఉప కాలువలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వ్యవస్థలన్నీ పూర్తి దెబ్బతిన్నాయి. వీటిని బాగు చేసేందుకు చేపట్టిన ఆధునీకరణ పనులన్నీ అర్థాంతరంగా ఆగిపోయాయి. వీటిని తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వంపై నేతలు ఒత్తిడి పెంచిన దాఖలాలు కనిపించలేదు. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా 12 మంది వైసిపి ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్న విమర్శలున్నాయి.

ఆగిన తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ ఆధునీకరణ

తుంగభద్ర డ్యామ్‌ నుంచి అనంతపురం జిల్లాకు సాగునీటి వనరు ఇచ్చిన ప్రధాన కాలువ ఆధునీకరణ పనులు 2008లో ప్రారంభమయ్యాయి. నాలుగేళ్లలో తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువను పూర్తి స్థాయిలో ఆధునీకరించడంతోపాటు ప్రవాహ సామర్థ్యాన్ని 2000 క్యూసెక్కుల నుంచి 4200 క్యూసెక్కులకు పెంచారు. ఆరు ప్యాకేజీలతో రూ.458.72 కోట్లతో చేట్టారు. ఇందులో 309.74 కోట్లు పూర్తయ్యాయి. అయితే ఆ తరువాత పనులను ఆపివేశారు. వైసిపి అధికారంలోకి వచ్చాక 2019లో రద్దు చేసింది. శింగనమల నియోజకర్గానికి సాగు,తాగునీటిని అందించే మిడ్‌ పెన్నార్‌ దక్షిణ కిలువ ఆధునీకరణ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఇక పనులు చేయలేమని రద్దు చేయమని కాంట్రాక్టరు విజ్ఞప్తి చేయడం గమనార్హం. మిడ్‌పెన్నార్‌ డ్యామ్‌ నుంచి 84 కిలోమీటర్ల మేరకు ఈ కాలువ ఉంది. రూ. 509.16 కోట్లతో పనులు చేపట్టడంతో రూ.205.79 కోట్లు పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు ఆ పనులు ఆగిపోయాయి.గుంతకల్లు బ్రాంచ్‌ కెనాల్‌ పనులు చేయలేం గుంతకల్లు బ్రాంచ్‌ కెనాల్‌ పనులు చేయలేమని కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. రూ.293.22 కోట్లతో చేపట్టిన పనుల్లో రూ.188 కోట్లు పూర్తయ్యాయి. ఈ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. వీటిని చేయలేమని పనులు రద్దు చేయమని కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేశారు. ఇలా ప్రధానమైన కాలువ పనులన్నీ మధ్యలోనే ఆగిపోయాయి.

➡️