ప్రధాని సభలో తొక్కిసలాట

  • పలువురికి గాయాలు
  • మోడీ ప్రసంగం ప్రారంభించగానే వెనుదిరిగిన ప్రజలు

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి: ప్రధాని మోడీ పాల్గొన్న చిలకలూరుపేట సభలో తొక్కిసలాట జరగడంతో కొందరికి గాయాలయ్యాయి. ప్రధాని రావడానికి గంట ముందు కొన్ని గ్యాలరీలు ఖాళీగా ఉండడంతో వేదికపై నుంచి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రజలను ఆంక్షలు పెట్టి బయట ఉంచొద్దని, అందరినీ లోపలికి పంపాలని పోలీసు అధికారులకు సూచించారు. అప్పటి వరకు విఐపి, మీడియా గ్యాలరీలలోకి పాస్‌లు ఉన్న వారినే అనుమతించారు. పుల్లారావు సూచనతో ఒక్కసారి సాధారణ ప్రజలను కూడా ఈ గ్యాలరీల్లోకి వదిలారు. బారికేడ్లను తొలగించడంతో ఒక్కసారిగా వీటిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. అప్పటికే ఉన్న మహిళలు, ప్రజాప్రతినిధులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అచ్చెన్నాయుడు ప్రసంగం ప్రారంభించగానే సభా వేదికపైకి ప్రధాని మోడీ వచ్చారు. దీంతో, అచ్చెన్నాయుడు ప్రసంగం అర్ధాంతరంగా ఆపేశారు. తరువాత పవన కల్యాణ్‌ ప్రసంగం ప్రారంభించారు. తొక్కిసలాటలో పలువురికి గాయాలయ్యాయి. మధ్యాహ్నం మూడు గంటల వరకు గ్యాలరీలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎండ తీవ్రత తగ్గిన తరువాత నాలుగు గంటలకు ఒక్కసారి ప్రజలు గ్యాలరీల్లోకి రావడంతో రద్దీ పెరిగింది. పోలీసు ఉన్నతాధికారులు, దిగువ స్థాయి అధికారులు, పార్టీల వలంటీర్ల నిర్వహణ లోపం స్పష్టంగా కనిపించింది. నారా లోకేష్‌ కూర్చున్న గ్యాలరీలోకి కూడా యువకులు చొచ్చుకురావడంతో ఆయన అక్కడ నుంచి నిష్క్రమించారు.


మోడీ ప్రసంగం ప్రారంభం కాగానే వెనుదిరిగిన జనం
ప్రధాని ప్రసంగం ప్రారంభం కాగానే ప్రజలంతా ఒక్కసారిగా లేచి బయటకు రావడం కన్పించింది. సభ ముగియకుండానే వెళ్లిపోతున్నారే మిటని వారిని ప్రశ్నించగా, చంద్రబాబు మాట్లాడడం అయిపోయిందిగా ఇంకెందుకు అని వారు సమాధానం ఇచ్చారు.
ప్రధాని ప్రసంగానికి అంతరాయం
ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో మైకులు మూడుసార్లు పనిచేయలేదు. దీంతో, ఆయన తన ప్రసంగాన్ని మూడుసార్లూ ఆపేశారు. అనువాదం చేయడానికి దగ్గుబాటి పురందీశ్వరి ఇబ్బంది పడ్డారు.
రాజధాని ప్రస్తావన లేకుండానే ముగింపు
రాజధాని జిల్లాలో సభ ఏర్పాటు చేసిన టిడిపి, జనసేన, బిజెపి ఈ అంశానికి ఏ మాత్రమూ ప్రాధాన్యత ఇవ్వలేదు. రాజధాని అంశాన్ని ప్రధాని ప్రస్తావించలేదు. దీంతో, రాజధానివాసులతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలూ తీవ్ర నిరాశకు గురయ్యారు.

➡️