బిజెపితో స్నేహం కోసం రాష్ట్రం తాకట్టు

– భూమి పూజకే ‘ఉక్కు’ పరిమితం
– సిఎం జగన్‌పై విమర్శలు గుప్పించిన వైఎస్‌.షర్మిల
ప్రజాశక్తి – వైఎస్‌ఆర్‌ జిల్లా యంత్రాంగం :బిజెపితో స్నేహం కోసం పోలవరం ప్రాజెక్టు, స్పెషల్‌ స్టేటస్‌, రాజధానిని తాకట్టు పెట్టిన ఘనత సిఎం జగన్‌కు దక్కుతుందని పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల విమర్శించారు. జగన్‌ ప్రభుత్వంలో రాష్ట్రాభివృద్ధి, జిల్లా అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊసే లేదన్నారు. శనివారం వైఎస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజవకర్గాల్లో ఆరో రోజు ఆమె బస్సుయాత్ర నిర్వహించారు. బస్సుయాత్రల్లో ఆమె మాట్లాడుతూ..యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు వైసిపి ప్రభుత్వం ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. వివేకానందరెడ్డిని క్రూరంగా హత్య చేసింది ఎంపి అవినాష్‌రెడ్డి అని సిబిఐ ఆధారాలు చూపుతున్నా నిందితుడిని సిఎం జగన్‌ కాపాడుతున్నారని ఆరోపించారు. తన పర్యటనకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి కడప ఎంపి అభ్యర్థిని మార్చేందుకు సిఎం జగన్‌ అడుగులు వేస్తున్నారన్నారు. ‘ప్రశాంతంగా ఉన్న పులివెందులలో షర్మిల, సునీత అల్లర్లు రేపుతున్నారని, వివేకాను ఎవరు చంపారో తేలకుండా ఎలా మాట్లాడుతారని’ షర్మిల మేనత్త విమలారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. వివేకానందరెడ్డి హత్య కేసులో ఆధారాలతోనే మాట్లాడుతున్నామని అన్నారు. వివేకా హత్య విషయంలో మేము ఆరోపణలు చేయడం కాదు, సిబిఐ చూపించిన ఆధారాలను మాత్రమే మేము ఎత్తి చూపిస్తున్నామని చెప్పారు. రైతుకు మద్దతు ధర ఎక్కడ అని ప్రశ్నించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాల వల్ల కడప ఇండిస్టియల్‌ ఏరియా మూతపడుతున్న పట్టించుకోవడం లేదన్నారు. అంతకుముందు వైఎస్‌ వివేకానందరెడ్డి సమాధి వద్ద సునీత, షర్మిలతో పాటు పలువురు కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
కాంగ్రెస్‌లో చేరిన పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు
అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం వైసిపి ఎమ్మెల్యే చిట్టిబాబు షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. షర్మిలను చిట్టిబాబు సన్మానించారు.
పరిశ్రమ, లక్ష ఉద్యోగాలు ఎక్కడీ
కడప ఉక్కు పరిశ్రమ కేవలం భూమి పూజకే పరిమితమైందని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల విమర్శించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈశ్వరయ్య, సిఐటియు, డివైఎఫ్‌ఐ నాయకులతో కలిసి జమ్మలమడుగులోని ఉక్కు పరిశ్రమ స్థలాన్ని ఆమె పరిశీలించారు. విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా రెండుసార్లు ఇక్కడికి వచ్చారని..మొదటిసారి శంకుస్థాపనకు, రెండోసారి భూమిపూజకు పరిమితమయ్యారే తప్ప ఒక ఇటుక కూడా పేర్చలేదని తెలిపారు. ఉక్కు పరిశ్రమ, లక్ష ఉద్యోగాలు ఎక్కడని నిలదీశారు. ఎన్‌.తులసిరెడ్డి మాట్లాడుతూ.. విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో సెయిల్‌ ఆధ్వర్యంలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మించాలని ఉన్నా పూర్తి చేయలేని స్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని విమర్శించారు.

➡️