శుద్ధ ఇంధనం ఉత్పత్తికి రాష్ట్రం కట్టుబడి ఉంది : సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో అమరరాజా గ్రూప్‌ ప్రతినిధులు సమావేశమయ్యారు. సంస్థ సహ వ్యవస్థాపకుడు గల్లా జయదేవ్‌, సంస్థ ప్రతినిధులు బుధవారం సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు, సీఎస్‌ శాంతి కుమారి ఈ భేటీలో పాల్గన్నారు. మహబూబ్‌నగర్‌లో అమరరాజా సంస్థ నిర్మిస్తున్న దేశంలోనే అతిపెద్దదైన లిథియం అయాన్‌ గిగా ఫ్యాక్టరీపై భేటీలో చర్చించారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. అమరరాజా కంపెనీకి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో అమరరాజా కంపెనీది కీలక పాత్ర అని పేర్కొన్నారు. శుద్ధ ఇంధనం ఉత్పత్తికి రాష్ట్రం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. అధునాతన సాంకేతికత ఉపయోగించే కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు.గల్లా జయదేవ్‌ మాట్లాడుతూ.. ”గిగా కారిడార్‌కు ప్రభుత్వం ఇస్తున్న సహకారం అభినందనీయం. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వంతో కలసి పని చేస్తాం. రాష్ట్రంలో మా వ్యాపారాన్ని మరింత విస్తరిస్తాం. విద్యుత్తు బ్యాటరీల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటునిస్తోంది” అని తెలిపారు.

➡️