గంజాయిపై ఉక్కుపాదం

  • దిశా స్టేషన్లు మహిళా పోలీస్‌ స్టేషన్లగా మార్పు
  •  హోం శాఖ మంత్రి అనిత

ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : నూతన ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపనుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. వచ్చే మూడు నెలల్లో పోలీస్‌ శాఖలో సమూల మార్పులుంటాయన్నారు. సిఎంతో చర్చించి పోలీసులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. దిశా పోలీస్‌ స్టేషన్లు సోమవారం నుంచి మహిళా పోలీస్‌ స్టేషన్లుగా పనిచేస్తాయన్నారు. విశాఖలోని ప్రభుత్వ అతిథి గృహంలో జిల్లా పోలీస్‌ యంత్రాంగంతో ఆమె సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో అనిత మాట్లాడుతూ వైసిపి హయాంలో విశాఖ నగరాన్ని కార్యనిర్వాహక రాజధానిగా మారుస్తామని చెప్పి గంజాయికి రాజధానిగా మార్చారని విమర్శించారు. గంజాయిని కర్రీ లీఫ్‌ పేరుతో ఆన్‌లైన్‌లో అమెజాన్‌ కేంద్రంగా విక్రయించారని తెలిపారు. విశాఖ సెంట్రల్‌ జైల్లో గంజాయికి సంబంధించిన కేసుల్లో 1,286 మంది ఉండగా, మిగతా మొత్తం రాష్ట్రంలో 365 మందే ఉన్నారన్నారు. సెంట్రల్‌ జైలుకు వెళ్లి వారి స్థితిగతులపై త్వరలో సమీక్ష జరుపుతానన్నారు. సోమవారం రాత్రి నుంచే విశాఖ నగరవ్యాప్తంగా గంజాయి నియంత్రణకు స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గంజాయికి సంబంధించిన సమాచారాన్ని పోలీస్‌ శాఖకు అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటు నగదు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. అంతకుముందు సింహా చలంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ గతంలో భయం లేకుండా వైసిపి ప్రభుత్వంతో అంటకాగిన అధికారులు ఎవరైనా ఉంటే పద్ధతి మార్చుకోవాలని వ్యాఖ్యానించారు.

➡️