కేన్సర్‌ రహిత రాష్ట్రంగా అడుగులు

– వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :కేన్సర్‌ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేలా అన్ని రకాల చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో ఆయనకు కేటాయించిన ఛాంబర్‌లో ఆదివారం రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యాశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాస్పత్రుల్లో ఎయిమ్స్‌ తరహాలో మెరుగైన వైద్యసేవలు అందజేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అందుకు అవసరమైన మౌలిక వసతులను మెరుగు పరచడంతోపాటు సిబ్బందిని కూడా సమకూర్చేలా చర్యలు చేపడతామన్నారు. ప్రతి ఏడాది సగటున 48 వేలమంది కేన్సర్‌ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఓరల్‌, బ్రెస్ట్‌, సర్వైకల్‌ కేన్సర్ల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు వ్యాధిని ముందుగానే గుర్తించి వైద్యసేవలు అందజేయాలనే లక్ష్యంతో దాదాపు 5.30 కోట్ల మందికి స్క్రీనింగ్‌ చేసేందుకు నిర్ణయం తీసుకుంటూ తొలి సంతకం చేశానన్నారు. ఇందుకోసం ఇంటింటి సర్వే నిర్వహించేందుకు అవసరమైన శిక్షణ హోమిబాబా కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో యువత పెద్దయెత్తున గంజాయి, డ్రగ్స్‌ వినియోగిస్తూ వాటికి బానిసలు అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయని, అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా డ్రగ్స్‌కు బానిసలైన యువతలో మార్పు తెచ్చేందుకు డి-ఆడిక్షన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వం అత్యంత ప్రధానమైన ఆరోగ్య రంగాన్ని ఎంతో నిర్లక్ష్యం చేసిందన్నారు. ఈ కార్యక్రమలో వైద్యారోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనరు ఎస్‌ వెంకటేశ్వర్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ పద్మావతి, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ నరసింహం, ఆరోగ్య విశ్వవిద్యాలయం విసి బాబ్జీ, రిజిస్ట్రారు రాధికారెడ్డి పాల్గొన్నారు.

➡️