హైకోర్టు ఏర్పాటుకు అడుగులు

  •  కర్నూలులో న్యాయ విశ్వవిద్యాలయం శంకుస్థాపనలో సిఎం జగన్‌
  • బనగానపల్లెలో ‘ఇబిసి నేస్తం’ మూడో విడత నిధులు విడుదల

ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన కర్నూలు జగన్నాథగట్టు వద్ద జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసి పైలాన్‌ను ఆవిష్కరించారు. బనగానపల్లె ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బటన్‌ నొక్కి ఇబిసి నేస్తం మూడో విడత నిధులు విడుదల చేశారు. లబ్ధిదారులకు మెగా చెక్‌ పంపిణీ చేశారు. బనగానపల్లెలో నూతనంగా నిర్మించిన వంద పడకల ప్రాంతీయ వైద్యశాల ప్రారంభం సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కర్నూలులోని జగన్నాథం గట్టు వద్ద, బనగానపల్లెలోనూ జరిగిన సభల్లో ముఖ్యమంత్రి మాట్లాడారు. శ్రీబాగ్‌ ఒడంబడిక ప్రకారం హైకోర్టు కర్నూలులోనే ఉండాలన్నారు. టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా పేదల భవిష్యత్తుపై యుద్ధానికి వస్తున్నాయని విమర్శించారు. ఈ మూడు పార్టీలూ 2014లో మోసపూరిత వాగ్దానాలు చేశాయని, అక్కచెల్లెమ్మల కోసం తొమ్మిది హామీలు ఇచ్చాయని, వాటిలో ఒకటీ అమలు చేయలేదని అన్నారు. దారుణంగా మోసం చేసిన వారు ఈ ఎన్నికల్లో రంగురంగుల మేనిఫెస్టోలతో వస్తున్నారని, వారి హామీలను నమ్మవద్దని ప్రజలను కోరారు. 99 శాతం హామీలను అమలు చేసిన మీ బిడ్డకు, మాయ మాంత్రికులకు మధ్య యుద్ధం జరుగుతోందని పేర్కొన్నారు.
మోసం చేసిన వాళ్లకు ఓటు అనే దివ్యాస్త్రంతో గుణపాఠం చెప్పాలన్నారు. అక్క చెల్లెమ్మలు బాగుంటే కుటుంబాలు బాగుంటాయని, ఎక్కడా కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ప్రతి పథకం లబ్ధిదారులకు అందుతోందని వివరించారు. విశ్వసనీయత లేదంటూ చంద్రబాబును, విలువలు లేవంటూ పవన్‌ కల్యాణ్‌ను విమర్శించారు. బనగానపల్లె వైసిపి అభ్యర్థిగా కాటసాని రామిరెడ్డిని ప్రకటించారు. ఆయనను గెలిపించాలని కోరారు. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన కార్యక్రమంలో మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ మాంధాత సీతారామమూర్తి, లోకాయుక్త చీఫ్‌ జస్టిస్‌ పి.లక్ష్మణరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ న్యాయ శాఖ కార్యదర్శి జి.సత్యప్రభాకర్‌, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️