25 నుంచి సమ్మె ఉధృతం- అంగన్‌వాడీ సంఘాల హెచ్చరిక

Dec 20,2023 21:56 #Anganwadi strike

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీ నుండి సమ్మె ఉధృతం చేస్తామని అంగన్‌వాడీ సంఘాలు ప్రకటించాయి. బుధవారం ఉదయం అలంకార్‌ సెంటర్లో నిరసన శిబిరం వద్ద ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు), ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ (ఎఐటియుసి), ఎపి ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కె సుబ్బరావమ్మ, ఎన్‌సిహెచ్‌ సుప్రజ, ప్రేమ, హెల్దా, విఆర్‌ జ్యోతి, పి భారతి పాల్గన్నారు. 12వ తేదీ నుండి అంగన్‌వాడీలు సమ్మెలో ఉన్నా ప్రభుత్వంలో చలనం లేదని పేర్కొన్నారు. అంగన్‌వాడీ సెంటర్ల తాళాలు పగులకొట్టిన వారిపై కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కోరింది. జెఎసి మద్దతుసమ్మెలో ఉన్న అంగన్‌వాడీలకు కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ జెఎసి మద్దతు ప్రకటించింది. ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరించడాన్ని ఖండించింది. ఈ మేరకు నాయకులు ఎవి నాగేశ్వరరావు, ఇ విజయకుమార్‌రాజు, డి దయామణి బుధవారం ప్రకటన విడుదల చేశారు.

సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తాం

– రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన అంగన్‌వాడీల ఆందోళనలు

– వంటా-వార్పు, భిక్షాటనలు చేస్తూ నిరసనలు

ప్రజాశక్తి-యంత్రాంగం:రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వం వెంటనే తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం తొమ్మిదో రోజుకు చేరింది. వంటాావార్పు, భిక్షాటన చేస్తూ తమ నిరసనను తెలిపారు. నోటికి నల్ల రిబ్బెన్లు కట్టుకొని ర్యాలీలు చేశారు. సమస్యలను పరిష్కరించే వరకూ సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ స్థాయి సమీక్షకు వచ్చిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, కర్నూలు కలెక్టర్‌ను అడ్డుకుని నిరసన తెలిపారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. మంత్రి ఎలాంటి సమాధానమూ చెప్పకుండా పోలీసుల సహకారంతో కారెక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కోసిగి, గూడూరులో ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు, చాగలమర్రి, కొలిమిగుండ్ల, కొత్తపల్లి, నందికొట్కూరు, మిడుతూరు, పగిడ్యాల మండల కేంద్రాల్లో భిక్షాటన చేశారు. రుద్రవరంలో ఉరితాళ్లు బిగించుకుని నిరసన తెలిపారు. గుంటూరు కలెక్టరేట్‌ వద్ద అంగన్‌వాడీల సమ్మెకు ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మద్దతు తెలిపి ప్రసంగించారు. అంగన్‌వాడీల ప్రధాన డిమాండ్లైన వేతనాల పెంపు, గ్రాట్యుటీపై సానుకూలంగా స్పందించాలని ప్రభుత్వాన్ని కోరారు. వట్టిచెరుకూరు, తాడికొండ, కొల్లిపరలో భిక్షాటన, తుళ్లూరులో మానవహారంతో నిరసన తెలిపారు. ప్రత్తిపాడులో వంటావార్పు చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో వంటావార్పు, వినుకొండలో నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. అంగన్‌వాడీలపై సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన దిష్టి బమ్మను దహనం చేశారు. సత్తెనపల్లిలో అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టిన వారిపై మున్సిపల్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద భిక్షాటన, పద్మనాభం మండల కేంద్రంలో వంటావార్పు చేశారు. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా భిక్షాటన చేపట్టి నిరసన తెలిపారు. కోటవురట్లలో అంగన్‌వాడీలకు ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్‌.పుణ్యవతి మద్దతు తెలిపి మాట్లాడారు. అంగన్‌వాడీలతో పెట్టుకున్న ప్రభుత్వాలు అంతమొందిపోతాయని హెచ్చరించారు. అల్లూరి జిల్లా రంపచోడవరంలో ఒంటికాలిపై నిరసన తెలిపారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన శిబిరంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు జి.బేబిరాణి పాల్గని మాట్లాడారు. వీరి సమ్మెకు కర్ణాటక బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షులు రత్నకుమార్‌ మద్దతు తెలిపారు. కోనసీమ జిల్లా అమలాపురం, రామచంద్రపురంలో భిక్షాటనతో నిరసన తెలిపారు. ఏలేశ్వరంలో వంటావార్పు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ చిత్రపటాన్ని దహనం చేశారు. బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం సచివాలయం వద్ద అంగన్‌వాడీల సమ్మెకు మద్దతుగా గ్రామంలోని తల్లులు తమ పిల్లలతో ఆందోళనలో పాల్గన్నారు. ఏలూరు కలెక్టరేట్‌ నిరసనలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్‌, ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.రవీంద్రనాథ్‌ పాల్గని మాట్లాడారు. జీలుగుమిల్లిలో పచ్చగడ్డి తింటూ అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. ఏలూరు నగరంలోని పలు వార్డుల్లో అంగన్‌వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టడానికి వచ్చిన సచివాలయ ఉద్యోగులను అంగన్‌వాడీలు అడ్డుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోనూ అంగన్‌వాడీలు భిక్షాటనతో నిరసన తెలిపారు. గజపతినగరం, కొత్తవలస రామభద్రపురంలో వంటా వార్పు చేశారు. విజయనగరం కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపి అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి భిక్షాటన నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్‌ వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. బమ్మనహాల్‌, డి.హిరేహాల్‌, పుట్లూరులో భిక్షాటన చేశారు. ఆత్మకూరులో చెవిలో పూలుపెట్టుకుని ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. నార్పల అంగన్‌వాడీలకు మద్దతుగా చిన్నారుల తల్లిదండ్రులు తహశీల్దార్‌ హరిప్రసాద్‌కు వినతిపత్రం అందజేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లాలో భిక్షాటన చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల, పొందూరు, శ్రీకాకుళం, టెక్కలి, ఆమదాలవలసలో భిక్షాటన నిర్వహించారు. రణస్థలంలో నోరు, చెవులు మూసుకుని నిరసన తెలిపారు. కొత్తూరు, కోటబమ్మాళిలో వంటావార్పు, పలాసలో మానవహారం నిర్వహించారు. టెక్కలిలో నిరసన కార్యక్రమంలో పాల్గనేందుకు వచ్చిన నందిగాం మండలం మణిగాంకు చెందిన అంగన్‌వాడీ సహాయకురాలు అస్వస్థతకు గురికావడంతో టెక్కలిలోని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఇచ్ఛాపురం పట్టణంలోని గొల్లవీధి అంగన్‌వాడీ కేంద్రాన్ని తెరిపించేందుకు వెళ్లిన మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌, సచివాలయ సిబ్బందిని అంగన్‌వాడీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్‌లో అంగన్‌వాడీ కేంద్రం తాళాలు పగులకొట్టేందుకు అధికారులు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. కృష్ణాజిల్లా గన్నవరంలో భిక్షాటనతో నిరసన చేశారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్‌ వద్ద వంటా వార్పు చేసి తమ నిరసనను తెలిపారు. కంకిపాడులో భిక్షాటన చేశారు. విజయవాడ ధర్నా చౌక్‌లో చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లాలో భిక్షాటన, బాపట్లలో చెవిలో పూలతో నిరసన తెలియజేశారు. కొల్లూరు, పంగులూరులో సమ్మె శిబిరం వద్దే వంటావార్పు నిర్వహించారు. తిరుపతిలో అంగన్‌వాడీలకు హిజ్రాలు మద్దతు తెలిపారు. పుత్తూరు, పిచ్చాటూరుల్లో భిక్షాటన చేశారు. బిఎన్‌ కండ్రిగలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. వైఎస్‌ఆర్‌ కడప, అన్నమయ్య జిల్లాల్లోని ఐసిడిఎస్‌, తహశీల్దార్‌, ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు. ఎక్కడికక్కడ భిక్షాటన చేస్తూ తమన నిరసనను తెలిపారు. కొన్ని చోట్ల సాష్టాంగ నమస్కారాలు పెడుతూ నిరసన తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరులో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. పలుచోట్ల అంగన్‌వాడీ కేంద్రాలను అధికారులు తెరిచేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు.

➡️