అటకెక్కిన రేషన్‌ డోర్‌ డెలివరీ

Dec 18,2023 11:00 #Ration

 

 కార్డుదారులకు తప్పని తిప్పలు

పజాశక్తి-బొమ్మనహాల్‌ (అనంతపురం జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన రేషన్‌ డోర్‌ డెలివరీ కార్యక్రమం బొమ్మనహాల్‌ మండల పరిధిలోని చాలా గ్రామాల్లో అటకెక్కిందని చెప్పవచ్చు. మండల వ్యాప్తంగా 33 గ్రామాల్లో 40 చౌకధాన్య డిపోల పరిధిలో 20వేల రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఆయా గ్రామాలకు మొత్తం 9 ఎండియు వాహనాలను కేటాయించారు. అయితే స్వల్ప కాలం లోనే వాహనాలకు ఆపరేటర్‌ లేక తూకాలు వేసే వారికి కూలి గిట్టబాటుకాక ఎక్కడికక్కడ ఎండియు వాహనాల సేవలు ఆగిపోయాయి. దీనికి తోడు చాలా చోట్ల డీలర్లు రేషన్‌ షాపుల్లోనే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో షాపు వద్దకే వెళ్లి బియ్యం, చక్కెర, కందిబేడలు, తదితర సరుకులు తెచ్చుకుంటున్నామని కార్డుదారులు పేర్కొంటున్నారు. ప్రధానంగా వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు రేషన్‌షాపునకు వెళ్లి సరుకులు తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వాహనాలు కొనుగోలు చేసినా ప్రయోజనం ఏంటని కార్డుదారులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో వాహనాలు మరమ్మతులు, డీజిల్‌ కొరత, కూలీలకు అరకొర వేతనం, అదీ నెల నెలా సక్రమంగా చెల్లించకపోవడంతో తమకు గిట్టుబాటు కావడం లేదని కొందరు పైలెట్లు వాపోతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి రేషన్‌ సరుకులు ఇంటికి చేరేలా చర్యలు తీసుకోవాలని కార్డుదారులు కోరుతున్నారు. ఈ విషయంపై తహశీల్దార్‌ శ్రీనివాసులును వివరణ కోరగా తమ దృష్టికి రాలేదని, అలా జరిగితే చర్యలు తీసుకుంటామని దాటవేశారు.

➡️