విద్యార్థులు న్యాయ సూత్రాలను విస్మరించకూడదు

  • విట్‌ 7వ వార్షికోత్సవ సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి రవికుమార్‌
  • పలువురు విద్యార్థులు, అధ్యాపకులకు అవార్డులు అందజేత

ప్రజాశక్తి – తుళ్లూరు (గుంటూరు జిల్లా) : విద్యార్థులు న్యాయ సూత్రాలను విస్మరించకూడదని, అది సమాజానికి ఎంతో ప్రమాదకరమని సుప్రీం కోర్టు న్యాయమూర్తి సిటి రవికుమార్‌ తెలిపారు. అమరాతిలోని విఐటి వర్సిటీ 7వ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా గౌరవ అతిథులు సుప్రీం కోర్టు న్యాయమూర్తి సిటి రవికుమార్‌, మైక్రోసాఫ్ట్‌ డాటా ఫ్లాట్‌ఫాం డైరెక్టర్‌ అమిత్‌ చౌదరి, విసి డాక్టర్‌ జి విశ్వనాధన్‌ విశ్వవిద్యాలయ వార్షిక నివేదికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అకాడమిక్‌ అవార్డులు 274 మందికి, ఎండోమెంట్‌ అవార్డులు 12, అధ్యాపక అవార్డులు 241, రీసెర్చ్‌ స్కాలర్స్‌ అవార్డులు 271 మందికి అందజేశారు. సభలో న్యాయమూర్తి రవికుమార్‌ మాట్లాడుతూ జీవితంలో అంకిత భావంతో పనిచేస్తే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని, ప్రతి విద్యార్థి అంకిత భావంతో విద్యను అభ్యసించి మహోన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. అకడమిక్‌, రిసెర్చ్‌ రంగాల్లో బహుమతులు సాధించిన విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు. అమిత్‌ చౌదరి మాట్లాడుతూ ఆధునిక విద్యలో డేటా ప్లాట్‌ఫారమ్‌లు, సాంకేతికత కీలక పాత్ర గురించి తెలియజేశారు. మైక్రోసాఫ్ట్‌ చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి వివరిస్తూ విఐటి విశ్వవిద్యాలయం ఉన్నత విద్యలో చేస్తున్న కృషిని కొనియాడారు. విఐటి వ్యవస్థాపకులు, విసి జి విశ్వనాథన్‌ మాట్లాడుతూ భారతదేశంలో ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 27 శాతం మాత్రమే ఉందని, ఇది ఇంకా పెరగాల్సిన అవసరముందని పేర్కొన్నారు. విఐటి నాలుగు క్యాంపస్‌లలో 80 వేల మంది విద్యార్థులకుపైగా చదువుతున్నారని, అత్యుత్తమ విద్యా విధానాలు, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యనందిస్తున్నామని, విద్యార్థులు సాధిస్తున్న విజయాలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. యూనివర్సిటీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించి వారి ఉన్నతవిద్యకు సహాయం చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఐదు సంవత్సరాల సర్వీస్‌ను పూర్తి చేసిన 24 మంది అధ్యాపకులు, ముగ్గురు సిబ్బందిని సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఎస్‌వి కోటారెడ్డి, డాక్టర్‌ జగదీష్‌ చంద్ర ముదిగంటి తదితరులు పాల్గొన్నారు.

➡️