కిర్గిజ్‌లో బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు

May 19,2024 21:13 #attack, #kyrgyz, #students
  •  దాడి జరిగే అవకాశముందని విద్యార్థుల ఆందోళన

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : వైద్య విద్యను అభ్యసించేందుకు వెళ్లిన దక్షిణ ఆసియా విద్యార్థులపై స్థానిక అల్లరి మూకలు దాడులు చేస్తున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన విద్యార్థి అక్మల్‌.. వైద్య విద్యను అభ్యసించడానికి కిర్గిజ్‌ వెళ్లారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమ కుమారుడి పరిస్థితి ఏమిటోనని ఎప్పటికప్పుడు యోగక్షేమాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏ క్షణానికి ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమని గడుపుతున్నామని తమ తల్లిదండ్రులకు విద్యార్ధులు చెప్పడంతో వారు మరింత కంగారుపడుతున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ ప్రభుత్వాలు ప్రత్యేక విమానాల ద్వారా తమ విద్యార్థులను స్వస్థలాలకు చేర్చే ప్రక్రియను ప్రారంభించాయని విద్యార్థులు చెబుతున్నారు. భారత విద్యార్థులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భారతదేశం నుంచి సుమారు 15 వేల మంది విద్యార్థులు కిర్గిజ్‌ వెళ్లినట్లు అంచనా. ఆ దేశ రాజధాని బిష్కేక్‌లోనే అత్యధిక మంది భారతీయ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.

పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది : అక్మల్‌, హిందూపురం వాసి
పరిస్థితి అంత సజావుగా లేదని కిర్గిజ్‌లో మొదటి సంవత్సరం వైద్యవిద్యను అభ్యసిస్తున్న శ్రీసత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన విద్యార్థి అక్మల్‌ ప్రజాశక్తికి తెలిపారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న భయం వెంటాడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని భారతీయ విద్యార్థులను స్వస్థలాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. ఆదివారం కూడా దాడులు జరిగినట్టు చెప్పారు.

➡️