ఉదారంగా ఆదుకోండి-‘కరువు’ పై సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌

Nov 25,2023 08:58 #cpm, #demands

ప్రజాశక్తి – అమరావతి బ్యూరోకరువులో చిక్కుకున్న రైతులను. వ్యవసాయ కూలీలను ఉదారంగా ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. శుక్రవారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసింది. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన విజయవాడ బాలోత్సవ భవనంలో జరిగిన ఈ సమావేశానికి సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ బేబి హాజరయ్యారు. కులాంతర వివాహాలకు రక్షణ కల్పించాలని, కల్యాణమస్తును ఐదు లక్షల రూపాయలకు పెంచాలని కూడా ఈ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. వీటిలో పాటు పలు తీర్మానాలను రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

మీడియాకు విడుదల చేసిన ఆ తీర్మానాల వివరాలు :

కరువుపై …’రాష్ట్రంలో సుమారు 300 పైగా మండలాలలో తీవ్రమైన కరువు ఏర్పడితే రాష్ట్రప్రభుత్వం 103 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించింది. వర్షాభావం వల్ల ప్రస్తుత ఖరీఫ్‌లో 85.97 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉండగా 60.22 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు వేశారు. సాగుభూమిలో 25.75 లక్షల (30 శాతం) ఎకరాల్లో పంటలు వేయలేదు. సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో వర్షాలు రాకపోవడంతో రాయలసీమ, కోస్తా ప్రాంతంలో అత్యధిక జిల్లాల్లో సాగైన పంటలూ చేతికి అందలేదు. తీవ్రమైన కరువు వల్ల ఉపాధి లేక లక్షలాది మంది పేదలు వలస పోయారు. కౌలుదారులు తీవ్రంగా నష్టపోయారు. కరువు పరిస్థితుల పట్ల సకాలంలో స్పందించి పంటల నష్టాన్ని అంచనా వేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఖరీఫ్‌ కరువు ప్రకటనకు చివరి రోజైన అక్టోబర్‌ 31న హడావుడిగా 103 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటన చేసింది. సమగ్ర సమాచారంతో కరువు నెలకొన్న అన్ని మండలాలలను కరువు మండలాలుగా ప్రకటించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలి’ అని కరువుపై చేసిన తీర్మానంలో సిపిఎం డిమాండ్‌ చేసింది. ‘ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో 17 మండలాల్లో కరువు పరిస్థితులుంటే ఒక్క మండలాన్ని కూడా ప్రకటించలేదు. ప్రకాశం జిల్లాలో 38 మండలాలకు గానూ 30 మండలాలు తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి, అయినా ఒక్క మండలాన్నీ ప్రకటించలేదు. బాపట్ల జిల్లాలో అద్దంకి, కొరిశపాడు, బల్లికురువ, సంతమావులూరు, పంగులూరు, మార్టూరు వంటి ఆరు మండలాల్లో తీవ్ర వర్షభావ పరిస్థితులున్నాయి. అయినా కరువు మండలాల ప్రకటనలో చేర్చలేదు. అనకాపల్లి జిల్లాలో 24 మండలాలకు 18 మండలాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులున్నాయి, ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించలేదు. ఏలూరు జిల్లాలో చింతలపూడి, చాట్రాయి, వేలేరుపాడు, కుక్కనూరు మండలాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు వున్నాయి. మరొక ఏడు మండలాలు పాక్షికంగా కరువు వాతపడ్డాయి. అయినా గుర్తించలేదు. సత్యసాయి జిల్లాలో 31 మండలాల్లో కరువు ఉంటే 21 మండలాలనే ప్రకటించి 11 మండలాలను విస్మరించారు. అనంతపురం జిల్లాలో మూడు మండలాలను విస్మరించారు. నెల్లూరు జిల్లాలో 38 మండలాల్లో 20 మండలాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులున్నాయి’ అని తీర్మానంలో పేర్కొన్నారు. పంట నష్టం ఆధారంగా…’కరువు అంచనాల నిబంధనలను పేర్కొంటూ నవంబర్‌ 14న జిఓ ఐదును ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జిఓ ప్రకారం రైతులకు కరువు సాయం నామమాత్రంగా అందే అవకాశం ఉంది. వేరుశెనగ ఎకరా సాగుకు రూ. 35 వేలు ఖర్చవుతుండగా ప్రభుత్వం రూ.6,800 కరువు సహాయం చేయనుంది. ఇతర పంటలకు చెల్లించే నష్టపరిహారం పరిస్థితి ఇలాగే ఉంది. పంటల నష్టం ఆధారంగా పరిహారం చెల్లించాలి. పంటల పెట్టుబడి కోసం బ్యాంకులు ఇస్తున్న స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఆధారంగా పరిహారం ఇవ్వాలి. వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు పరిహారం చెల్లించాలి. కరువు మండలాల్లో వలసలను నివారించేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు 200 రోజులు కల్పించి రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలి. కరువు ప్రాంతాల్లో ఆహార ధాన్యాలు ఉచితంగా అందించాలి. రైతుల బ్యాంకు అప్పులను మాఫీ చేయాలి. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు కల్పించాలి. ప్రభుత్వం విస్మరించిన అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలి.’ అని సిపిఎం డిమాండ్‌ చేసింది. కళ్యాణమస్తు.. కులాంతర వివాహాలపై ‘కళ్యాణమస్తు, తోఫా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నజరానా కంటితుడుపు చర్య. కులాంతర వివాహం చేసుకున్న దళిత, ఆదివాసీలకు రూ.75 వేల నుండి 1.20 లక్షలు చేసినట్లు ప్రకటించడం యువతను తప్పుదారి పట్టించడమే. వాస్తవానికి ఇరుగు పొరుగు రాష్ట్రాలన్నింటిలోనూ రూ.2.5 లక్షలు ఇస్తున్నారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలంటే వారిపై సాగుతున్న దాడులను, అణచివేతను అరికట్టాలి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కులదురహంకార (పరువు) హత్యలు జరుగుతున్నాయి. కులం పేరుతో రాక్షసంగా మారి కన్న బిడ్డలనే హతమారుస్తున్నారు. వీటిని అరికట్టడానికి ప్రభుత్వ చర్యలు శూన్యం. దీనికోసం ప్రత్యేక చట్టం చేయాలి. కులాంతర వివాహాలు చేసుకున్న వారికిచ్చే సహాయాన్ని ఐదు లక్షలకు పెంచాలి. అదే విధంగా భార్యాభర్తల్లో ఏ ఒక్కరికి ఉద్యోగం లేకపోయినా ఉద్యోగం కల్పించాలి. ఇంటిస్థలం ఇచ్చి పక్కా గృహం నిర్మించాలి’ అని సిపిఎం డిమాండు చేసింది. .

➡️