వీధులు ఊడుస్తూ.. జలదీక్ష చేస్తూ…

Jan 22,2024 11:25 #Anganwadi strike
  • అంగన్‌వాడీల నిరసన ప్రదర్శనలు
  • ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని డిమాండ్‌

ప్రజాశక్తి-యంత్రాంగం : వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తదితర డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి 41వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగిం చారు. వీధులు ఊడుస్తూ, జలదీక్ష చేస్తూ, మోకాళ్లపై నిలబడి నిరసన ప్రదర్శనలు చేశారు. పలుచోట్ల రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వం మొండివైఖరిని విడనాడాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో వీధులు ఊడ్చి నిరసన తెలిపారు. పెదకాకానిలో సమ్మె శిబిరాన్ని ఆటో వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ బెదిరింపులు, ఒత్తిళ్లకు లొంగబోమని తెనాలి సమ్మె శిబిరంలో అంగన్‌వాడీలు ప్రతిజ్ఞ చేశారు. పల్నాడు జిల్లా వినుకొండ మండలం విఠంరాజుపల్లి గ్రామంలోని చెరువలో దిగి అంగన్‌వాడీలు జలదీక్ష చేశారు. జగన్‌ తమను నిండా ముంచేశారంటూ దండాలు పెడుతూ నిరసన తెలిపారు. అంగన్‌వాడీలను బెదిరించి… విధుల్లో చేరుతున్నట్లు లేఖలు తీసుకుంటున్నారనే కారణంతో నాదెండ్ల సిడిపిఒ కార్యాలయంలో నాయకులు నిరసన తెలిపారు. ఎన్‌టిఆర్‌ జిల్లా మైలవరంలో లక్ష సంతకాలు సేకరించి ప్రదర్శనగా ఉంచారు. అనంతరం విజయవాడ లోని రాష్ట్ర నాయకత్వానికి పంపించారు. నందిగామలో అంగన్‌వాడీలు మోకాళ్ళపై నిలబడి నిరసన తెలిపారు. విజ యనగరం జిల్లా సాలూరులో ఆకులు తింటూ, పాలకొండలో కల్లు మూసుకొని, విజయనగరంలో దండాలు పెడుతూ నిరసన తెలిపారు. శృంగవరపుకోటలో రాస్తారోకో చేశారు. గజపతినగరంలో 41 అంకె ఆకృతిలో నిరసన తెలిపారు. అనకాపల్లి జిల్లాలోని పరవాడ, అనకాపల్లి, చోడ వరంలలో దీక్షలు కొనసాగాయి. అల్లూరి జిల్లా విఆర్‌. పురంలో అంగన్‌వాడీల సమ్మెకు సిఐటియు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు సంఘీభావం తెలిపారు. అన్నమయ్య, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాల్లో అంగన్‌వాడీలు ఐసిడిఎస్‌, ఎంపిడిఒ, తహశీల్దార్‌ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం విజయవాడకు బయలుదేరారు. ప్రకాశం జిల్లా శింగరాయకొండ మండలంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సంతకాలు సేకరించారు. అంగన్‌ వాడీల సమ్మెకు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాలా అంజయ్య మద్దతు తెలిపారు. తూర్పుగోదావరి, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాలో సమ్మె శిబిరాలు కొనసాగాయి. విజయవాడకు వెళ్లరాదంటూ సమ్మె శిబిరాల్లో ఉన్న అంగన్‌ వాడీలకు పోలీసులు ముందస్తు నోటీసులు అందించారు. శ్రీకాకుళం, కృష్ణా, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో నిరసన దీక్షలు కొనసాగాయి.

మంత్రి పెద్దిరెడ్డిని అడ్డుకున్న అంగన్‌వాడీలపై కేసులు

ప్రజాశక్తి – అనంతపురం ప్రతినిధి : అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన 10 మంది అంగన్‌వాడీలపై పోలీసులు ఆదివారం కేసులు నమోదు చేశారు. శనివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వారును అడ్డుకున్నారంటూ ఈ చర్యలు తీసుకున్నారు. తహశీల్దారు ఫిర్యాదు మేరకు సుమారు పది మందిపై కేసులు నమోదు చేశారు. సిఐటియు నాయకులు మధుసూదన్‌, రంగారెడ్డి, ఎఐటియుసి నాయకులు చండ్రాయుడుతోపాటు మరో ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్టు సమాచారం. ఈ నెల 23న ఉరవకొండలో సిఎం జగన్‌ పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డిని అంగన్‌వాడీలు అడ్డుకున్నారు. కాన్వారు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వారిని బలవంతంగా పక్కకు లాగేసి కాన్వారును ముందుకు కదిలించారు. మంత్రిని అడ్డుకున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

➡️