శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

Apr 3,2024 21:00 #Entrance Test, #Polyset-2024

– సాంకేతిక విద్య కమిషనర్‌
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పాలిసెట్‌-2024 ప్రవేశ పరీక్ష కోసం విద్యార్థులకు అందిస్తున్న ప్రత్యేక శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి సూచించారు. పాలిటెక్నిక్‌ ప్రవేశాల పెంపు లక్ష్యంగా ఇస్తున్న సమగ్ర శిక్షణకు మంచి స్పందన లభిస్తుందని చెప్పారు. విజయవాడ, గుంటూరులోని ఎంబిటిఎస్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌తో సహా, పలు ప్రవేశ శిక్షణ కేంద్రాలను బుధవారం ఆమె సందర్శించారు. విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. పాలిటెక్నిక్‌ ప్రవేశాలను కోరుకునే ప్రతిఒక్కరికీ శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 87 ప్రభుత్వ, 182 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఈ నెల 24 వరకు తరగతులు నిర్వహిస్తామని, 25న గ్రాండ్‌ ప్రీఫైనల్‌ ప్రవేశ పరీక్షను కూడా నిర్వహిస్తామని వివరించారు. తెలుగు, ఇంగ్లీష్‌ మాధ్యమ విద్యార్థులకు ఉపయోగపడేలా రెండు భాషల్లోనూ స్టడీ మెటీరియల్‌ సిద్ధం చేశామని పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల కోరిక మేరకు ఈ నెల 8 నుంచి మరో బ్యాచ్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 27న ప్రవేశ పరీక్ష జరగనుందని, దరఖాస్తు గడువు ఈ నెల 5తో ముగియనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి రమణబాబు, సంయుక్త కార్యదర్శి జానకిరామ్‌, ఉప కార్యదర్శి రవికుమార్‌, కళాశాల ప్రిన్సిపల్‌ శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️