మెరుగవుతున్న తమ్మినేని ఆరోగ్యం

Jan 19,2024 11:14 #Tammineni Veerabhadram

వెంటిలేటర్‌ను తొలగించిన వైద్యులు

ప్రజాశక్తి –  హైదరాబాద్‌ బ్యూరో  :   సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం మెరుగు పడుతోంది. గురువారం ఆయనకు వెంటి లేటర్‌ను తొలగించారు. ఆయన సొంతం గానే శ్వాస తీసుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. డాక్టర్లు, పార్టీ నాయకులతో మెల్లగా మాట్లాడుతున్నారు. బిపి, పల్స్‌ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. కిడ్నీ పనితీరు మెరుగుపడుతోందని, గుండె కొట్టుకోవడంలో మార్పు వచ్చిందని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళనా అవసరం లేదని సిపిఎం రాష్ట్ర కమిటీ పేర్కొంది. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో బాధపడుతున్న తమ్మినేని మంగళ వారం నుంచి హైదరాబాద్‌లోని ఎఐజి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రుల పరామర్శ

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆస్పత్రికి వచ్చి తమ్మినేని పరామర్శించి ఆయన ఆరోగ్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తమ్మినేని సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని, ప్రజాక్షేత్రంలోకి తిరిగి రావాలని ఆకాక్షించారు. తమ్మినేనిని పరామర్శించిన వారిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తదితరులు ఉన్నారు.

తమ్మినేనికి సిపిఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పరామర్శ

గత మూడు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ్మినేని వీరభద్రంను సిపిఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పరామర్శించారు. గురువారం హైదరాబాద్‌లోని ఎఐజి ఆసుపత్రికి వెళ్లి తమ్మినేనిని పరామర్శించిన శ్రీనివాసరావు, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్‌ డిఎన్‌ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. తమ్మినేని కుటుంబ సభ్యులను కూడా కలసి ఆయన మాట్లాడారు.

చెరుపల్లి, వెంకట్‌ తదితరుల పరామర్శ

సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, బి.వెంకట్‌, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య, పోతినేని సుదర్శన్‌, చుక్క రాములు తదితరులు గురువారం తమ్మినేని వీరభద్రంను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

➡️