టిడిపి కూటమిప్రభంజనం

Jun 5,2024 07:35 #2024 election, #chandrababau, #TDP

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభంజనం సృష్టించింది. శాసనసభతో పాటు లోక్‌సభ స్థానాల్లోనూ కూటమి పూర్తిస్థాయిలో ఆధిక్యత సాధించింది. ఒక్కమాటలో చెప్పాలంటే వార్‌ వన్‌సైడ్‌గా మారింది. ‘దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసేలా….. ప్రపంచం నివ్వెరపోయేలా’ అంటూ వైసిపి అధినేత జగన్‌మోహన్‌రెడ్డే చెప్పిన విజయాన్ని టిడిపి కూటమి సొంతం చేసుకుంది. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ టిడిపి కూటమి ఏకంగా 164 స్థానాలను దక్కించుకుంది. కూటమిలోని టిడిపి 135 స్థానాల్లో విజయం సాధించగా, పవన్‌కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పోటీచేసిన అన్ని స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేసి నూరుశాతం స్ట్రైక్‌రేట్‌ను సాధించింది. బిజెపి 8 స్థానాల్లో గెలుపొందింది. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన వైసిపికి ఈసారి ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కలేదు. అధికారంలో ఉన్నన్నాళ్లు అవినీతికి, నిరంకుశత్వ విధానాలకు చిరునామాగా మారిన ఆ పార్టీ ప్రజలకు పూర్తిగా దూరమైంది. జిల్లాలకు జిల్లాలను టిడిపి కూటమి స్వీప్‌ చేస్తే వైసిపి కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఆ పార్టీ ముఖ్యనేతలతోపాటు గంపగుత్తుగా మంత్రులందరూ ఓటమి పాలయ్యారు. సొంత నియోజకవర్గం పులివెందులలో గత ఎన్నికలతో పోలిస్తే జగన్‌ మెజార్టీ సైతం తగ్గింది. ఘోర ఓటమి అనంతరం జగన్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు. లోక్‌సభ స్థానాల్లోనూ ఇదే పరిస్థితి. 16 స్థానాల్లో టిడిపి, రెండు స్థానాల్లో జనసేన గెలుపొందింది. రాష్ట్రానికి పదేపదే ద్రోహం చేసి, తాజా ఎన్నికల్లో కూటమి భాగస్వామిగా ఆరుస్థానాల్లో బరిలోకి దిగిన బిజెపిపై ప్రజాగ్రహం స్పష్టంగా కనిపించింది. మూడు లోక్‌సభ స్థానాల్లోనే బిజెపి అభ్యర్థులు విజయం సాధించారు. వైసిపి నాలుగు లోక్‌సభ స్థానాలతో సరిపెట్టుకుంది.

దుష్పరిపాలనపై ప్రజాగ్రహం : సిపిఎం


సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఆ పార్టీ కార్యదర్శి వి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన భారాలు, విచ్చలవిడి అవినీతి, అరాచక పాలన, నిరంకుశ విధానాల వల్ల ప్రజాగ్రహం వ్యక్తమైందని, అది ఫలితాల్లో కనిపించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో బిజెపి పోటీచేసిన ఆరు పార్లమెంటు స్థానాల్లో మూడు స్థానాల్లో ఓడించడం రాష్ట్రానికి కేంద్రం చేసిన ద్రోహానికి ప్రజల స్పందనని తెలిపారు. రాష్ట్రంలో రెండు శిబిరాల వారూ విచ్చలవిడిగా డబ్బు పంచారు. వారి మధ్య హోరాహోరీ పోటీ నడిచిన నేపథ్యంలో ఇండియా బ్లాకు పార్టీలకు ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదు. అయినా అరకు పార్లమెంటులో సిపిఎంకు లక్షకుపైనా ఓట్లు రావడం హర్షణీయమని పేర్కొన్నారు. రంపచోడవరం అసెంబ్లీ స్థానంలో గతంకన్నా ఓట్లు పెరిగాయని, సిపిఎం పోటీచేసిన ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు మిగిలిన రాష్ట్రంలో ఇండియా బ్లాకు పార్టీలకు ఓటు వేసిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

నిరంకుశ పాలనకు తిరస్కారం : సిపిఐ

ఎపి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసిపి ఓటమి.. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ నిరంకుశ పాలనకు ప్రజలిచ్చిన తిరస్కారమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. కక్షసాధింపు రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజల తీర్పు అని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజా ఉద్యమాలను అణచివేసి పోలీసు రాజ్యంగా నడిపించారని, ప్రతిపక్ష నేతలపై వేధింపులు, బెదిరింపులు, అక్రమ అరెస్టులు చేశారని అన్నారు. అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసేలా మూడు ముక్కలాట ఆడారని పేర్కొన్నారు. పది లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాళా తీయించారని తెలిపారు. అన్ని రకాల భారాలు పెంచారని, అభివృద్ధి అనే మాటను జగన్‌ ప్రభుత్వం అటకెక్కించిందని, ఫలితంగా ఓటమి చవిచూసిందని పేర్కొన్నారు.

రాష్ట్రం గెలిచింది.. ప్రజలు గెలిచారు : టిడిపి

రాష్ట్రం గెలిచింది.. ప్రజలు గెలిచారు అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఓట్ల వెల్లువతో టిడిపి-జనసేన-బిజెపి కూటమిని ఆశ్వీరదించిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు అని మంగళవారం ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాడి గెలిచామని పేర్కొన్నారు. దెబ్బతిన్న రాష్ట్రాన్ని పునర్‌ నిర్మించుకునేందుకు కలిసికట్టుగా కృషి చేస్తామన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు కట్టుబడి ఉన్న నరేంద్ర మోడీ, అమిత్‌ షా, జెపి నడ్డాలకు కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. తమ కూటమి కార్యకర్తలు, నేతల కఠోర శ్రమ, అంకితభావం ఫలితంగా ఈ చారిత్రాత్మక విజయం సాకారమైందని తెలిపారు. చివరి ఓటు కూడా పడే వరకు తెగించి పోరాడిన తీరు అద్భుతమని, కూటమి నేతలు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు.

మోడీకి నైతిక ఓటమి : కాంగ్రెస్‌

ప్రజా తీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నాం. రాజ్యాంగాన్ని కాపాడటం లో తొలి విజయం సాధించాం. మోడీకి, ప్రజలకు మధ్యనే ఈ పోరు అని మొదటి నుంచి చెబుతున్నాం. ఈ సారి ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. కానీ ప్రజలు మోడీకి వ్యతిరేకంగా ఉన్నారని స్పష్టమైన సందేశమిచ్చారు. ఇది మోడీకి రాజకీయంగానే గాక, నైతిక పరాజయం కూడా. కాంగ్రెస్‌, ఇండియా ఫోరం ఈ ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. ప్రభుత్వ యంత్రాంగం అడుగుడుగునా అడ్డంకులు సష్టించినా ప్రజలు ఇంతటి విజయాన్ని అందించారు. ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన విజయం.

➡️