తాగునీటి సమస్యపై దృష్టిపెట్టాలి : టిడిపి అధినేత చంద్రబాబు

Apr 10,2024 22:46 #chandrababu, #TDP, #water crisis

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యపై దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. రైతులకు సాగునీరు లేదని, ప్రజలకు తాగునీరు లేదని బుధవారం ఎక్స్‌(ట్విట్టర్‌)లో పేర్కొన్నారు. సీమలోని పల్లెల నుంచి గోదావరి జిల్లాలోని ఏజెన్సీ వరకు ఎక్కడ చూసినా అంతా దుర్భర పరిస్థితే అని పేర్కొన్నారు. కరెంటు బిల్లులు కట్టక కొన్ని, నిర్వహణ లేక ఇంకొన్ని తాగునీటి పథకాలు మూలనపడ్డాయని తెలిపారు.

పేర్ని నానిపై ఇసికి ఫిర్యాదు
మచిలీపట్నం పోలీస్‌ స్టేషన్‌పై మాజీ మంత్రి పేర్ని నాని, వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు దాడి చేశారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఇఒ ముకేష్‌కుమార్‌ మీనాకు టిడిపి ఫిర్యాదు చేసింది. సచివాలయంలో మీనాను కలిసి ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బుధవారం ఫిర్యాదు చేశారు. 2019 తర్వాత కడప జిల్లాలో నియమించబడ్డ హోంగార్డులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని టిడిపి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్‌గోపాల్‌ రెడ్డి లేఖ ద్వారా సిఇఒకు ఫిర్యాదు చేశారు. సిఎం జగన్‌ ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో తన వద్దనున్న ప్రైవేటు సెక్యూరిటీని హోంగార్డులుగా నియమించారని తెలిపారు.
కమీషన్ల కోసం సిఎం జగన్‌ బహిరంగ మార్కెట్‌లో అధిక ధరకు విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నారని టిడిపి కార్యానిర్వాహక కార్యదర్శి నాదెళ్ల బ్రహ్మం చౌదరి విమర్శించారు. టిడిపి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సిఎం జగన్‌, మంత్రి విడదల రజిని చర్యలతో వైద్యరంగం నిర్వీర్యమైందని టిడిపి ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్‌ సూర్య విమర్శించారు. వలంటీర్లను పార్టీ సేవకులుగా కాకుండా ప్రజాసేవకులుగా తీర్దిదిద్దుతామని ఆ పార్టీ ప్రతినిధి మదిపట్ల సూర్యప్రకాష్‌ తెలిపారు.

➡️