తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ 

Jan 4,2024 08:39 #Dispute, #TDP leaders
tdp leaders disputes kesinani brothers
  • తిరువూరులో రణరంగం
  •  ఎస్‌ఐకు గాయాలు 
  • కేశినేని బ్రదర్స్‌ మధ్య ఆధిపత్య పోరు

ప్రజాశక్తి – తిరువూరు : తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు కుర్చీలు, చెప్పులు, బకెట్లు విసురున్నారు. ఎస్‌ఐకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ నెల ఏడున ఎన్‌టిఆర్‌ జిల్లా తిరువూరులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ సభను విజయంతం చేయాలని నియోజకవర్గ స్థాయి సమావేశంతో ఈ రణరంగా చోటు చేసుకుంది. పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, పలువురు రాష్ట్ర నాయకులతోపాటు ఆ పార్టీకి చెందిన విజయవాడ ఎంపి కేశినేని శ్రీనివాస్‌ (నాని), ఆయన సోదరుడైన కేశినేని చిన్ని, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహనరావు హాజరయ్యారు. సాయంత్రం నాలుగు గంటలకు ఎంపి కేశినేని నాని టిడిపి కార్యాలయానికి తన అనుచరులతో వచ్చారు. సమావేశం జరిగే వేదిక వద్ద ఏర్పాటు చేసిన ప్లెక్సీలో ఎంపి నాని ఫొటో చిన్నదిగాను, చిన్ని ఫొటో పెద్దదిగానూ ఉంది. దీంతో ఎంపి నాని అనుచరులు గొడవకు దిగారు. ఆ ప్లెక్సీని చించేసి ”జై నాని” అంటూ నినాదాలు చేశారు. కుర్చీలను పైకి విసిరేశారు. అనంతరం కేశినేని చిన్నిని పార్టీ కార్యాలయంలోకి రానివ్వకుండా గేటు బయట ఎంపి అనుచరులు బైటాయించారు. చిన్ని తన అనుచరులతో కార్యాలయంలోకి వెళుతుండగా అడ్డుకున్నారు. ఈ క్రమంలో రెండు గ్రూపుల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల సహకారంతో ఎట్టకేలకు చిన్ని పార్టీ కార్యాలయంలోకి వెళ్లారు. దీంతో ”గో బ్యాక్‌ చిన్ని” అంటూ నాని అనుచరులు నినాదాలు చేశారు. చిన్ని కూడా తన అనుచరులతో కలిసి అక్కడే కింద కూర్చున్నారు. ”జై ఎన్‌టిఆర్‌, జై చంద్రబాబు, జై కేశినేని చిన్ని” అంటూ ఒకవైపు, ”జై కేశినేని నాని” అంటూ మరోవైపు నినాదాలతో టిడిపి కార్యాలయం దద్దరిల్లింది. చిన్ని బయటకు వెళ్లాలంటూ ఎంపి అనుచరులు కుర్చీలు విసిరేశారు. ఈ క్రమంలో కార్యాలయంలో ఉన్న నాని బయటకు వచ్చారు. చిన్ని ఎలాగైనా ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించగా రెండు గ్రూపుల మధ్య తీవ్రమైన తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు వారిని అదుపు చేస్తున్న క్రమంలో ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోవడంతో ఓ కుర్చీ బలంగా ఎస్‌ఐ సతీష్‌ తలకు తగలింది. రక్తం రావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఎంపి నాని తన అనుచరులతోను, చిన్ని తన అనుచరులతో పోటాపోటీగా బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో సిఐ లాఠీఛార్జికి ఆదేశించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో చిన్నిని బయటకు పంపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసుతో ఎంపి సమావేశం నిర్వహించారు.

➡️