ఇంటింటి ప్రచారానికి ముందస్తు అనుమతా? -సిఇసికి టిడిపి లేఖ

Apr 7,2024 22:45 #letter, #TDP

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీకి కూడా ముందస్తు అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఇచ్చిన ఆదేశాలు అభ్యంతరకరమని టిడిపి రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదివారం లేఖ రాశారు. ఇంటింటికి ప్రచారం, కరపత్రాల పంపిణీలపై స్పష్టత ఇవ్వాలని 10 రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరినా ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు. నెల్లూరు రూరల్‌ ఇంటింటి ప్రచారానికి వెళ్లిన తమ పార్టీ వారిపై ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు అభ్యంతరాలు తెలిపారని, దూషించారని పేర్కొన్నారు. ప్రతి రోజూ, ప్రతి గ్రామం, ప్రతి వార్డులో ప్రచారం కోసం అనుమతి తీసుకోవడం సాధ్యం కాదని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ తరహా ఉత్తర్వులను ఎన్నడూ ఇవ్వలేదని వివరించారు. డోర్‌ టు డోర్‌ ప్రచారం, కరపత్రాల పంపిణీ విషయంలో రాష్ట్ర ఎన్నికల అధికారులకు తగు సూచనలు, ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
జగన్‌ అబద్దాలకు ప్రజలు నమ్మారు: మాల్యాద్రి
సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పే అబద్ధాలు నమ్మి మరో మోసపోవడానికి ప్రజలు అమాయకులు కాదని టిడిపి జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి అన్నారు. జగన్‌ తన అవలక్షణాల్ని చంద్రబాబు నాయుడుకు ఆపాదించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై దూషణలు, నిందలు, అబద్ధాలు తప్ప చేసిందేంటో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో జగన్‌ ఉన్నారని అన్నారు.
యువత ఆలోచించి ఓటు వేయాలి : విజయ్ కుమార్‌
రానున్న ఎన్నికల్లో యువత ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలని టిడిపి అధికార ప్రతినిధి నీలాయపాలెం విజరుకుమార్‌ అన్నారు. టిడిపి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఐదేళ్లుగా వైసిపి పాలనలో రాష్ట్రం ఎలా నాశనమయ్యిందో యువత, ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పారు. ఏ ప్రభుత్వం జీవనోపాధి కల్పించిందో, పరిశ్రమలు తెచ్చిందో, ఉద్యోగ అవకాశాలు, సంపద సృష్టించిందో తెలుసుకోవాలని తెలిపారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారని, వైసిపి ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదని, ఉన్న వాటినే తరిమికొట్టిందని అన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని పేర్కొన్నారు.

➡️