గురుకుల ఉపాధ్యాయ సమస్యలపై చర్చించాలి 

Teachers should discuss the problems of teachers
  • మండలిలో పిడిఎఫ్‌ వాయిదా తీర్మానం 
  • రైతాంగ సమస్యలపై చర్చించాలని టిడిపి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గురుకుల ఉపాధ్యాయుల సమస్యలపై చర్చను కొనసాగించాలని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు కెఎస్‌ లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వరరావు, స్వతంత్ర ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ శాసనమండలిలో వాయిదా తీర్మానం అందించారు. మండలి ప్రారంభం కాగానే బుధవారం ఈ వాయిదా తీర్మానాలను ఛైర్మన్‌కు అందించారు. వీటిని మండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేను రాజు తిరస్కరించారు. గురుకుల సిబ్బందికి నాలుగు నెలల నుంచి వేతనాలు ఇవ్వలేదని లక్ష్మణరావు అన్నారు. వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై చర్చించేందుకు అనుమతినివ్వాలని కోరారు. రాష్ట్రంలో రైతాంగ సమస్యలపై చర్చించాలని టిడిపి సభ్యులు వేపాటి చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్‌, బిటి నాయుడు, భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి, పంచుమర్తి అనురాధ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని కూడా ఛైర్మన్‌ తిరస్కరించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఆదుకోకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతోందని టిడిపి సభ్యులు చెప్పారు. లోపభూయిష్టమైన బీమా విధానాన్ని రద్దు చేయాలని పట్టుబట్టారు. వాయిదా తీర్మానాలపై చర్చించాలని పట్టుబడుతూ పిడిఎఫ్‌, టిడిపి సభ్యులు వారి సీట్ల వద్దే నిరసన వ్యక్తం చేశారు. సభ్యుల ఆందోళన కొనసాగుతుండగానే సభను ఛైర్మన్‌ కొనసాగించారు. అనంతరం సభను 11 గంటల వరకు వాయిదా వేశారు. సభ ప్రారంభం కాగానే పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ 2024-25 బడ్జెట్‌ను మండలిలో ప్రవేశపెట్టారు.

➡️