జగన్‌ ఇంటి నిర్మాణాల కూల్చివేతపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌

-ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌పై బదిలీ వేటు
ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో :హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లోని ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేతపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా నిర్మాణాలు, షెడ్ల కూల్చివేతకు ఆదేశాలు జారీ చేసిన జిహెచ్‌ఎంసి ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ బోర్ఖడే హేమంత్‌ను బదిలీ చేసింది. సాధారణ పరిపాలన విభాగానికి అటాచ్‌ చేస్తూ జిహెచ్‌ఎంసి ఇన్‌ఛార్జి కమిషనర్‌ ఆమ్రపాలి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. లోటస్‌పాండ్‌లోని జగన్‌ ఇంటి ముందు ఫుట్‌పాత్‌పై సెక్యూరిటీ కోసం గతంలో షెడ్లు నిర్మించారు. రహదారిని ఆక్రమించి చేపట్టిన ఈ నిర్మాణాల వల్ల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. దీంతో, ఈ నిర్మాణాలను జెసిబితో జిహెచ్‌ఎంసి అధికారులు శనివారం కూల్చివేశారు. దీనిపై ప్రభుత్వ ఉన్నత వర్గాల్లో చర్చ జరగడంతో ప్రభుత్వం జిహెచ్‌ఎంసి కమిషనర్‌ను వివరణ కోరింది. జగన్‌ ఇంటికి సమీపంలో నివాసం ఉండే ఓ మంత్రి ఆదేశాలతోనే జోనల్‌ కమిషనర్‌ కూల్చివేత ఉత్తర్వులు ఇచ్చారని తేలడంతో జిహెచ్‌ఎంసి కమిషనర్‌ సీరియస్‌గా స్పందించారు. ఉన్నతాధికారులకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఆదేశాలిచ్చిన ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ను జిఎడికి అటాచ్‌ చేస్తూ జిహెచ్‌ఎంసి కమిషనర్‌ ఆమ్రపాలి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

➡️