రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు

-నిధుల సమీకరణ ప్రక్రియ వేగవంతం
– పంద్రాగస్టు లోగా అమలు
ప్రజాశక్తి -హైదరాబాద్‌ బ్యూరో:వ్యవసాయ రుణాల మాఫీ ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటంతో ఆరు నూరైనా ఆగస్టు 15 లోగా రైతులను రుణ విముక్తులను చేయాలని సంకల్పించినట్లు సమాచారం. ఒక్కొ రైతుకు రూ.రెండు లక్షల చొప్పున రుణమాఫీ చేసి తీరతామంటూ రేవంత్‌ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం సుమారు రూ.35 వేల కోట్లు కావాలంటూ ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ఆ మేరకు నిధుల సమీకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందుకోసం ఉన్న అన్ని మార్గాలనూ అన్వేషించాలంటూ సిఎం ఉన్నతాధికారులను ఆదేశించారు. ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సైతం దీనిపై సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తున్నారు. ‘రైతు పాసుబుక్కులో రుణం సున్నా అని చూపించాలి.. వారికి బ్యాంకుల నుంచి వేధింపులు ఉండొద్దు…’ అనే పద్ధతుల్లో బ్యాంకర్లతో రేవంత్‌ సర్కార్‌ సంప్రదింపులు జరుపుతోంది. తద్వారా రాజకీయంగా రైతుల్లో తమకు మంచి మైలేజ్‌ వస్తుందని సిఎం అంచనా వేస్తున్నారు. అలా చేస్తే తమ వెసులుబాటునుబట్టి ఏడాదికి కొంత మేర దశల వారీగా రూ.35 వేల కోట్లను చెల్లిస్తామంటూ బ్యాంకులకు హామీ ఇచ్చే విధంగా ఉన్నతాధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. అందులో భాగంగా ఏడాదికి రూ.ఏడు వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.35 వేల కోట్లను చెల్లించేలా బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలనే ఆలోచనలో సర్కారు ఉన్నట్టు తెలిసింది.
గత బిఆర్‌ఎస్‌ సర్కారు 2018 ముందస్తు ఎన్నికలకు ముందు రూ.లక్ష వరకూ ఉన్న రుణాలను మాఫీ చేసింది. అయితే ఏకకాలంలో కాకుండా నాలుగు దశల్లో (విడతకు రూ.25 వేల చొప్పున) మాఫీ చేయటం వల్ల రైతులకు పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. మొదటి విడత తర్వాత రెండో విడత చెల్లించేలోపు మిగిలున్న రూ.75 వేల అప్పుపై రైతుకు వడ్డీ మీద వడ్డీ పడింది. ఈ రకంగా నాలుగు విడతల నాటికి ‘రుణాలు మాఫీ’ అయ్యాయని అనిపించినప్పటికీ వడ్డీ మాత్రం అలాగే మిగిలిపోయింది. ఈ భారానికి తోడు మొత్తం అప్పు తీరిస్తేనే కొత్త రుణాలను ఇస్తామంటూ బ్యాంకులు పేచీ పెట్టటంతో అన్నదాతకు మరిన్ని ఇబ్బందులు తలెత్తాయి. ఈ క్రమంలో కేసీఆర్‌ సర్కారు మాదిరిగా కాకుండా రుణమాఫీని ఏకకాలంలో చేసి తీరతామనీ, అది కూడా రూ. రెండు లక్షల వరకూ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది.
అయితే ఇక్కడ నిధుల సమీకరణ అన్నది సర్కారుకు అతి పెద్ద సవాల్‌గా మారనున్నది. ఇందుకోసం బ్యాంకర్లను ఒప్పించేందుకు వీలుగా ఆర్థిక శాఖకు సిఎం స్పష్టమైన సంకేతాలనిచ్చారు. ముఖ్యంగా ఆర్‌బిఐ వద్ద ప్రభుత్వ బాండ్లను అమ్మకానికి పెట్టటం ద్వారా సర్కారు నెలకు రూ. ఎనిమిది వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల వరకూ నిధులను పోగేసుకుంటున్నది. ఇతరత్రా మార్గాల ద్వారా నెలకు రూ.15 వేల కోట్ల దాకా ప్రభుత్వానికి రాబడులు వస్తున్నాయి. వీటిలో సింహభాగం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, భత్యాలు, అలవెన్సులు, కార్యాలయాల నిర్వహణకే పోతోంది. ఈ నేపథ్యంలో రైతు రుణమాఫీ నిధుల సమీకరణకు ‘రెండు మార్గాల’పై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. వీటిలో ఒకటి బ్యాంకులను ఒప్పించి, మెప్పించి, ఏడాదికింత చొప్పున చెల్లిస్తామంటూ అంగీకరింపజేయటం. రెండోది హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చెల్‌-మల్కాజ్‌గిరి జిల్లాల చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములను బ్యాంకుల వద్ద కుదువ పెట్టటం. ఇందుకోసం ఇప్పటికే తెలంగాణ ఇండిస్టీయల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టిజిఐఐసి) సేకరించిన (ల్యాండ్‌ బ్యాంక్‌) భూముల్లోంచి కొన్నింటిని వియోగించుకునేందుకు ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో భాగంగా రంగారెడ్డి, మేడ్చెల్‌-మల్కాజ్‌గిరి జిల్లాల్లోని 760 ఎకరాల భూమిని కూడా గుర్తించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. తద్వారా రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకూ సమకూర్చుకోవచ్చనే అంచనాతో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది.

➡️