కృష్ణపట్నం పోర్టులో ఉద్రిక్తత

Mar 11,2024 10:20 #Krishnapatnam

పార్టీల నాయకులను అడ్డుకున్న యాజమాన్యం

ప్రజాశక్తి – నెల్లూరు ప్రతినిధి : నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో కంటైనర్‌ టెర్మినల్‌ ఉద్యోగుల నిరసనకు మద్దతుగా వెళ్లిన సిపిఐ, టిడిపి, జనసేన పార్టీ నాయకులను పోర్టు యాజమాన్యం అడ్డుకుంది, కార్మికులకు ఉపాధి కల్పించడంతోపాటు, మూసివేతను నిలుపుదల చేయాలని గత కొద్ది రోజులుగా సిపిఎం, సిపిఐ, టిడిపి, జనసేన పార్టీలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టిడిపి పొలిట్‌బ్వూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో పాటు ఆయా రాజకీయ పార్టీల నేతలు ఆదివారం పోర్టులోకి వెళ్లడానికి ప్రయత్నించారు. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకొని లోనికి వెళ్లడానికి అనుమతి లేదన్నారు. దీంతో నాయకులకు, సెక్యూరిటీకి వాగివ్వాదం జరిగింది. ఈ సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కృష్ణపట్నం పోర్టులో కంటైనర్‌ టెర్మినల్‌ మూసివేతతో ఉద్యోగాలు కోల్పోయిన వారి నిరసనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చామని, ఎందుకు అనుమతి ఇవ్వరని ప్రశ్నించారు. ఫిబ్రవరి 8న పోర్టు సిఇఒ జిజె రావును కలిశామని, 15 రోజుల్లో కంటైనర్‌ టెర్మినల్‌ సేవలు పునరుద్ధరిస్తామని ఆయన హామీ ఇచ్చారని గుర్తుచేశారు. గడువు ముగియడంతో ఇచ్చిన హామీ అమలుపై ఆయన తీసుకున్న చర్యలను తెలుసుకునేందుకు సంప్రదించామన్నారు. అన్ని పోర్టులు వెజల్స్‌ షెడ్యూల్‌ ఇస్తున్నా అదానీ కష్ణపట్నం పోర్టు నుంచి మాత్రం ఎలాంటి షెడ్యూల్‌ లేదన్నారు. ఈ రోజుకీ జీరో షెడ్యూలే ఉందని తెలిపారు. ఖాళీ కంటైనర్లతో షో చేసిన కాకాణి గోవర్ధన్‌ రెడ్డికి అన్ని పోర్టుల షెడ్యూళ్లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. దుమ్ము, ధూళి కారణంగా నాలుగున్నర పుట్లు పండే భూమి రెండున్నర పుట్లకు తగ్గిపోయిందని, పది వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. అధికారులు స్పందించకుంటే పోరాటం ఉధృతం చేస్తామన్నారు. టిడిపి నేత బొమ్మి సురేంద్ర, దామా అంకయ్య, జనసేన బి సురేష్‌నాయుడు, టిడిపి ఈదూరు రామోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

➡️