బిజెపిని గద్దె దించడమే లక్ష్యం

  • కార్మికవర్గం ఆ దిశగా ఉద్యమించాలి
  • సిఐటియు జాతీయ సెమినార్‌లో డాక్టర్‌ కె హేమలత

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : మోడీ ప్రభుత్వ వినాశకర విధానాలను తిప్పిగొట్టాలంటే రాబోవు ఎన్నికల్లో బిజెపిని గద్దె దించడమే అందరి లక్ష్యం కావాలని సిఐటియు అఖిల భారత అధ్యక్షులు డాక్టర్‌ కె.హేమలత అన్నారు. సిఐటియు జాతీయ నాయకులు పర్సా సత్యనారాయణ శత జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీకాకుళంలోని అంబేద్కర్‌ ఆడిటోరియంలో ఆదివారం ‘కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మికవర్గంపై దాడి-పరిష్కారాలు’ అంశంపై నిర్వహించిన జాతీయ సెమినార్‌లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రయివేటీకరణ విధానాలను మరింత తీవ్రంగా అమలు చేస్తూ కార్మికవర్గంపై దాడి చేస్తోందన్నారు. పెట్టుబడిదారీ సమాజం సంక్షోభం నుంచి బయట పడేందుకు కార్మికులపై భారాలు మోపుతోందని వివరించారు. అందులో భాగంగానే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చి కార్మికుల భద్రత, పని గంటల విషయంలో యాజమాన్యాలు ఇప్పటివరకు అనుసరిస్తోన్న చట్టవ్యతిరేక అంశాలకు చట్టబద్ధత కల్పిస్తోందని విమర్శించారు. శాశ్వత ఉద్యోగుల సంఖ్య క్రమేణా తగ్గిపోయి కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌, ఫిక్సిడ్‌ టెర్మ్‌, డైలీవేజ్‌ వంటి రకరకాల కేటగిరీలకు చెందిన ఉద్యోగులు పెరుగుతున్నారన్నారు. ఉద్యోగులు, కార్మికుల డిమాండ్లను వినడానికి బిజెపి ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు. పోర్టులు, ఎయిర్‌ పోర్టులు, గనులు ఇలా ప్రజల సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతోందని దుయ్యబట్టారు. ప్రయివేటీకరణ అనుకున్నంత వేగంగా సాగడం లేదని నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసే ప్రయత్నాలను మరింత వేగం చేసిందని విమర్శించారు. దేశీయ కంపెనీల ఉత్పాదక శక్తిని చంపేసి విదేశీ కంపెనీలకు ఇక్కడి వనరులను కట్టబెడుతోందన్నారు. బ్లూ ఎకానమీ పేరుతో సముద్ర తీరంలో ఖనిజాల తవ్వకాలను అనుమతులిస్తూ మత్స్యకారులకు తీవ్ర నష్టం చేస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వాలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తోందని వివరించారు. లేబర్‌ కోడ్‌లకు అనుకూలంగా విధానాలను రూపొందించబోమని కేరళలోని వామపక్షం తేల్చి చెప్పడంతో ఆ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను ఆపేసిందన్నారు. గవర్నర్లతో వేధింపులకు గురి చేస్తోందని తెలిపారు. విద్యుత్‌ సంస్కరణలను తీసుకురాబోమని చెప్పిన కేంద్ర ప్రభుత్వం… స్మార్ట్‌ మీటర్ల రూపంలో దొడ్డిదారిన తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. బిజెపి విధానాలను ప్రశ్నించే గొంతుకలను నొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు. బిజెపి తప్పుడు విధానాలను తిప్పిగొట్టాలి : సిహెచ్‌.నర్సింగరావుబిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వత ఉద్యోగాలంటూ లేకుండా పోయాయని, చివరకు సైన్యంలోనూ నాలుగేళ్లకే ఇళ్లకు పంపేస్తున్నారని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించడం వల్లే అందులోకి ఎవరూ అడుగుపెట్టలేకపోయారని గుర్తు చేశారు. మోడీ, జగన్‌ ప్రభుత్వాలు వారి అనుయాయులు, కార్పొరేట్ల కోసం ఉన్నాయి తప్ప ప్రజలు, రైతులు, కార్మికుల కోసం కాదని అన్నారు. రైతులు, కార్మికులు ఏకతాటిపైకి వచ్చి రాబోవు ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు రూపొందించిన సావనీర్‌ను ఆవిష్కరించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు పాల్గొన్నారు.తేజేశ్వరరావు దంపతులకు పరామర్శసిపిఎం సీనియర్‌ నాయకులు చౌదరి తేజేశ్వరరావు, సంపూర్ణమ్మ దంపతులను డాక్టర్‌ కె.హేమలత, సిహెచ్‌.నరసింహారావు పరామర్శించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిస్టు ప్రణాళిక పుస్తకాన్ని వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

➡️