దాడి కేసు సిబిఐకి అప్పగించాలి

Apr 14,2024 22:16 #firyadu, #TDP leaders

– ఎన్నికల సంఘానికి టిడిపి ఫిర్యాదు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన రాయి దాడి కేసును సిబిఐకి అప్పగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని టిడిపి కోరింది. రాష్ట్ర అదనపు సిఇఒ హరీంద్ర ప్రసాద్‌ను ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు సచివాలయంలో ఆదివారం కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం వర్ల మీడియాతో మాట్లాడుతూ.. అధికారాన్ని నిలబెట్టుకోవడంలో భాగంగానే రాయితో హత్యాయత్నం జరిగిందని జగన్‌ డ్రామా క్రియేట్‌ చేశారని విమర్శించారు. ఐదేళ్ల క్రితం ఇలాగే కోడికత్తి డ్రామా ఆడారని అన్నారు. తమ పార్టీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక పోలీసులతో దర్యాప్తు చేయిస్తే ఈ భాగోతం బయటకు రాదని, కేసు సిబిఐ దర్యాప్తుకు ఇవ్వాలని తమతోపాటు జనసేన, బిజెపి డిమాండ్‌ చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేస్తామన్నారు. ఇంటెలిజెన్స్‌ డిజి ముందుగానే కళ్లు తెరచి ఉంటే ఇది జరిగేది కాదన్నారు. దాడి సన్నివేశాలకు సంబంధించి తమ ప్రశ్నలకు జవాబిచ్చే దైర్యం వైసిపి నేతలకు ఉందా? అని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. దాడి సినిమాకు స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌ ఐ ప్యాక్‌ టీమ్‌దే అని అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు.
టిడిపి కార్యాలయంలో అంబేద్కర్‌ జయంతి వేడుకలు
రాజ్యాంగ నిర్మాత బిఆర్‌ అంబేద్కర్‌ జయంతి వేడుకలు టిడిపి కార్యాలయంలో ఆదివారం జరిగాయి. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, నేతలు దేవినేని ఉమామహేశ్వరావు, పి అశోక్‌ బాబు, తెనాలి శ్రావణ్‌ కుమార్‌ తదితరులు పాల్గన్నారు.

➡️