జిందాల్‌తో ఒప్పందం నిజమే : విశాఖ ఉక్కు సిఎండి ప్రకటన

  • అంతకుముందు బుకాయింపు మాటలు

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : జిందాల్‌తో ఒప్పందం చేసుకున్న విషయం నిజమేనని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ సిఎండి అతుల్‌భట్‌ ప్రకటించారు. ఒప్పంద వివరాలను బహిర్గతం చేయాలంటూ కార్మికసంఘాలు సుదీర్ఘఆందోళన చేసిన తరువాత గురువారం ఒప్పందం అంశాన్ని ఆయన ధృవీకరించారు. ‘జిందాల్‌తో ఆర్‌ఐఎన్‌ఎల్‌ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. ఈ నెల 30న బ్లోయింగ్‌-ఇన్‌ చేసేందుకు ప్లాన్‌ చేసిన బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3ని ప్రారంభించనున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. ఈఒప్పందం ప్లాంటుకు వర్కింగ్‌ కేపిటల్‌ మద్దతు దొరుకుతుందని తెలిపారు. అంతకుముందు ఆయన కార్మికసంఘాల ముందు బుకాయించే ప్రయత్నం చేశారు. ఒప్పందం వివరాలు తెలపాలని వారు కోరుతుండగా ఆయన తప్పించుకు వెళ్లే ప్రయత్నం చేశారు. స్టీల్‌ ప్లాంటు కాన్ఫరెన్స్‌ హాలులో గురువారం సిఎండితో కార్మిక సంఘాల నేతలు సమావేశమైనారు. ఈ సందర్భంగానే జిందాల్‌తో కుదుర్చుకున్న ఒప్పందం గురించి ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంటులోకి కార్పొరేట్‌ శక్తులను తీసుకువచ్చిన అపకీర్తిని మూటగట్టుకో వద్దని వారు సూచించారు. తప్పించుకుపోవడానికి ఆయన ప్రయత్నించారు. కార్మికులు ఆయనను బయటకు వెళ్లనీయకుండా నేలమీద కూర్చుని అడ్డగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని కంపెనీలకు తాము ఒకే నమూనా ఇచ్చామని, టాటా స్టీల్‌తో ఇటువంటి ఒప్పందమే చేసుకున్నామని, సెయిల్‌కు కూడా ఈ తరహా ఒప్పంద పత్రాలే పంపామని అన్నారు. అయితే, ఒప్పంద పత్రాలు బయటపెట్టాల్సిందేనని డిమాండ్‌ చేసిన కార్మిక సంఘాల నేతలు అక్కడే భైఠాయించారు. జిందాల్‌ వంటి కార్పొరేట్‌ కంపెనీని విశాఖ స్టీల్‌ ప్లాంటులోకి తీసుకురావద్దని, కాదని ఏకపక్షంగా ఆహ్వానిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వీరి ఆందోళన కొనసాగుతుండగానే అక్కడినుండి వెళ్ళిపోయిన సిఎండి. ఇతర అధికారులు అనంతరం క్లుప్తంగా ప్రకటన విడుదల చేశారు.

➡️