తల్లుల దాతృత్వం వెలకట్టలేనిది

Apr 3,2024 21:50 #generosity, #mothers

– రోటరీ హ్యూమన్‌ మిల్క్‌ బ్యాంక్‌ ప్రారంభోత్సవంలో వక్తలు
ప్రజాశక్తి -తిరుపతి :అవసరమైన చంటి బిడ్డలకు ముర్రు పాలు ఇచ్చి వారి ప్రాణాలను కాపాడుతున్న తల్లుల దాతృత్వం వెలకట్టలేనిదని పలువురు వక్తలు అన్నారు. తిరుపతి రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో రూ.30 లక్షల వ్యయంతో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన రోటరీ హ్యూమన్‌ మిల్క్‌ బ్యాంకును ఎస్‌వి మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌, అదనపు వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ చంద్రశేఖరన్‌ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ.. రాయలసీమలోనే తొలిసారిగా మధర్‌ మిల్క్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. రోటరీ క్లబ్‌ వారు చేస్తున్న ఉదార సాయంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రసూతి ఆస్పత్రి సూపరిటెండెంట్‌ డాక్టర్‌ పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ తల్లి పాలకు కుల, మత, వర్ణ, వర్గ, పేద, ధనిక భేదాలు లేవన్నారు. ఆరోగ్యకరమైన ఏ తల్లి ఇచ్చిన పాలనైనా అవరమైన బిడ్డలకు అందించి పసి పిల్లలను కాపాడాలన్న సంకల్పంతో ఏర్పాటు చేస్తున్న ఈ మిల్క్‌ బ్యాంక్‌ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సుసేన హెల్త్‌ ఫౌండేషన్‌ కార్యదర్శి, నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ సభ్యులు డాక్టర్‌ సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘తల్లి పాలు అందుబాటులో లేని పిల్లలను కాపాడుకుందాం… తల్లిపాలు దానం చేద్దాం’ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ శ్రీహరి మాట్లాడుతూ ముర్రుపాలు దానం చేయడం వల్ల రొమ్ము కేన్సర్‌ వచ్చే అవకాశాలు తగ్గుతాయని, ప్రొలాక్టిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి అయ్యి కుటుంబ నియంత్రణకు సహకరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రుయా ఆస్పత్రి సూపరిటెండెంట్‌ డాక్టర్‌ జి.రవి ప్రభు, సీనియర్‌ ప్రిడియాటిషన్‌ సరితా చౌదరి, సీనియర్‌ కన్సల్టెంట్‌ నియో నేటాలజీ డాక్టర్‌ శ్రీనాథ్‌ మణికంఠ, ప్రసూతి వైద్య విభాగాధిపతి డాక్టర్‌ ప్రమీల, చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్‌ మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️