గవర్నర్‌ ప్రసంగం చూస్తే కాంగ్రెస్‌ మేనిఫెస్టోను చదివినట్లు ఉంది : కడియం

Dec 15,2023 15:16 #kadiyam srihari, #press meet

హైదరాబాద్‌: ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చేసిన ప్రసంగంలో కొత్తదనం కనిపించలేదని.. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి స్పష్టత ఇవ్వలేదని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గవర్నర్‌ ప్రసంగం చూస్తే కాంగ్రెస్‌ మేనిఫెస్టోను చదివినట్లు ఉందని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద కడియం మాట్లాడారు.”గత పదేళ్లలో రాష్ట్రం తిరోగమనంలో ఉందని గవర్నర్‌ ప్రసంగంలో చెప్పారు. రాష్ట్రంలో పంటల దిగుబడి, విస్తీర్ణం పెరిగింది నిజం కాదా? వరి ధాన్యం ఉత్పత్తి, 24 గంటల విద్యుత్‌ అందించింది నిజం కాదా? జాతీయ స్థాయిలో తెలంగాణ అనేక అవార్డులు సొంతం చేసుకుందని గతంలో చెప్పారు. గవర్నర్‌ ఈ అంశాలన్నింటినీ మర్చిపోయినట్లున్నారు. అబద్ధాలు చెప్పడం గవర్నర్‌ పదవిని అవమానించినట్లే అవుతుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం గవర్నర్‌తో అన్నీ అబద్ధాలే చెప్పించింది. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో 24 గంటల కరెంట్‌ ఇవ్వడం లేదని రైతులు, ప్రజలు రోడ్డెక్కిన పరిస్థితులు ఎక్కడా లేవు. ప్రభుత్వం శ్వేతపత్రాలు ప్రకటించిన తరువాత అన్ని అంశాలపై మాట్లాడుతాం” అని కడియం స్పష్టం చేశారు.

➡️