‘ఇండియా’ వేదికకు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి మద్దతు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :కేంద్రంలో బిజెపిని, రాష్ట్రంలో దాని పొత్తు, తొత్తు పార్టీలను ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ‘ఇండియా’ వేదికకు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సమితి అధ్యక్షులు జి కుమార్‌ చౌదరి, ప్రతినిధులు వీరేందర్‌, గౌరీ శంకర్‌, గోపాలకృష్ణ తదితరులు శనివారం విజయవాడలోని దాసరి భవన్‌లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణను కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ..రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని, వ్యవసాయం, పారిశ్రామిక, నీటిపారుదల రంగాల అభివృద్ధి పడకేసిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తానని గత ఎన్నికల వేళ ప్రగల్భాలు పలికిన జగన్మోహన్‌రెడ్డి.. అధికారం చేపట్టాక మాట తప్పారని విమర్శించారు. ప్రత్యేక హోదా, విభజన చట్ట హామీల అమలు కేవలం ‘ఇండియా’ వేదికతోనే సాధ్యమని చెప్పారు. ‘ఇండియా వేదిక గెలుపు – ఎపి అభివృద్ధికి మలుపు’ అని అన్నారు. జి కుమార్‌ మాట్లాడుతూ, ఇండియా వేదిక అభ్యర్థుల గెలుపుకోసం ప్రతి నియోజకవర్గంలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి కృషి చేస్తుందని చెప్పారు. రాహుల్‌, వేణుచారి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️