కొత్త న్యాయ చట్టాలను రద్దు చేయాల్సిందే..

Jul 1,2024 23:41 #dharn, #lawyers
  • పలు జిల్లాల్లో ధర్నాలు, నిరసనలు

ప్రజాశక్తి – యంత్రాంగం : కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త న్యాయ చట్టాలు ప్రజల హక్కులను హరించే విధంగా ఉన్నాయని, వాటి అమలును తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ పలు జిల్లాల్లో ధర్నాలు నిర్వహించారు. ఆటో రిక్షా కార్మిక సంఘం, మోటార్‌ వర్కర్స్‌ యూనియన్‌, భారత న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిరసనలు తెలిపారు. కొత్త చట్టాల అమలును ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో అంబేద్కర్‌ ఫ్లెక్సీ వద్ద న్యాయవాదులు నిరసన తెలిపారు. జులై 1 నుండి అమలయ్యే నూతన న్యాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సత్వర న్యాయం కోసం కొత్త నేర చట్టాలను రూపొందించామని కేంద్రం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కొత్త చట్టాలు ప్రజల హక్కులను హరించే విధంగా ఉన్నాయని, వీటి అమలను ఆపకపోతే రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరు దేశవ్యాప్త ఆందోళన ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విజయనగరం కోట జంక్షన్‌ వద్ద ఆటో వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ధర్నాలో ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ కౌన్సిల్‌ సభ్యులు ఎ.జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ డ్రైవర్లను క్రిమినల్స్‌ను చేస్తూ ఐదేళ్లు జైలు శిక్ష పడే విధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భారత న్యాయ సంహిత చట్టాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడ అలంకార్‌ సెంటర్‌, ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించారు. ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కోశాధికారి కె.దుర్గారావు పాల్గొని మాట్లాడారు. కంచికచర్లలో హిట్‌ అండ్‌ రన్‌ కేసును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పలు ఆటో స్టాండ్‌ల వద్ద నిరసనలు నిర్వహించారు. విశాఖ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం, మోటార్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన నిరసన తెలిపారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం కూడలిలో ధర్నా చేశారు.

➡️