ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టు నేరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే

  •  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
  •  బిజెపి సూచన మేరకే జగన్‌ ఆమోదం
  • కమలాన్ని నెత్తినెత్తుకున్న చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ప్రమాదకరమైన ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టు తీసుకొచ్చిన నేరం కేంద్రంలోని, రాష్ట్రంలోని ఉన్న వైసిపి, టిడిపిలదేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. ఈ చట్టంతో భూములపై సొంత హక్కులు ప్రశ్నార్థకం అవుతాయని, తాత ముత్తాతల రికార్డులు చూపించి నిరూపించుకోకపోతే భూములను పెండింగ్‌లో పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తనను కలిసిన మీడియాతో శ్రీనివాసరావు మాట్లాడారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టుతో భూములు లాగేసుకుంటారని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారని, ఆ చట్టాన్ని తీసుకొచ్చిన బిజెపితో కలిసి ఎందుకు ఎన్నికల్లోకి వెళుతున్నారో చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని నీతి అయోగ్‌ తయారు చేసిన ఈ చట్టాన్ని అన్ని రాష్ట్రాలకు పంపించి ఆమోదించాలని కోరితే జగన్మోహన్‌రెడ్డి గులాంగిరీ చేస్తూ అసెంబ్లీలో వెంటనే ఆమోదించి పంపించారని తెలిపారు. ఈ చట్టానికి బాధితులు ప్రజలయితే బిజెపి, వైసిపి నాయకులు నేరస్తులేనని తెలిపారు. బిజెపిని పట్టుకుని వేలాడుతున్న చంద్రబాబు దీనిపై కేంద్రాన్ని ఎందుకు అడగడం లేదో చెప్పాలని కోరారు. రాష్ట్ర విభజన అనంతరం ఐదేళ్లు టిడిపి, ఐదేళ్లు వైసిపి అధికారంలో ఉన్నాయని, ఈ పదేళ్లలో ఏమి చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. అమరావతి కడగండ్ల దుస్థితికి ఎవరు కారణమో చెప్పాలని అన్నారు. రాజధాని లేకుండా చేసిన ఘనత చంద్రబాబుది అయితే మూడు రాజధానుల పేరు చెప్పి ఎక్కడా అభివృద్ధి చేయని ఘనత జగన్మోహన్‌రెడ్డిదని విమర్శించారు. విశాఖను అభివృద్ధి చేస్తానని చెప్పిన జగన్‌ అది కూడా చేయలేదని పేర్కొన్నారు. జగన్‌ ప్రకటన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు ఉపయోగపడింది తప్ప రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనమూ లేదని పేర్కొన్నారు. విశాఖను ఉద్ధరించే ప్రయత్నమూ ఏమీ లేదని ముఖ్యమంత్రి మాత్రం విశాఖలో రూ.500 కోట్లు పెట్టి భవంతి కట్టుకున్నారని, అదే ఆయన సాధించిన ఘనతని తెలిపారు. కొండను తొలచి సిఎం ఇళ్లు కట్టుకున్నారని, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పోరంబోకు, కొండ పోరంబోకు, కాలువకట్టలు, కొండలపై పేదలు ఇళ్లేసుకుని దశాబ్దాల తరబడి ఉంటుంటే వారికి పట్టాలు ఇవ్వలేదు సరికదా ఖాళీ చేయాలని బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహించారు. పేదల కోసం ఉన్నామని చెప్పుకునే వారు వేలాది మంది గుడిసెవాసులకు ఎందుకు పట్టాలు ఇవ్వలేదని ప్రశ్నించారు. జగనన్న కాలనీ పేరుతో సెంటు స్థలం ఇస్తామని వైసిపి అంటే రెండు సెంట్లు ఇస్తామని టిడిపి వాళ్లు వస్తున్నారని, ఇప్పటికే ఇళ్లు వేసుకున్న వారికి పట్టాలు ఎందుకు ఇవ్వరని నిలదీశారు. జగన్‌ గెలిచినా, టిడిపి గెలిచినా బిజెపి గెలిచినట్లేనని, ఢిల్లీ పాలన, అమిత్‌షా పెత్తనం వస్తుందని అన్నారు. బిజెపి నాయకులు ఢిల్లీ పాలనతో రాష్ట్రాన్ని కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నారని, దాన్ని అనుమతించాలా అని ప్రశ్నించారు. ఇప్పటికే చంద్రబాబు, జగన్‌ అదానీ, అంబానీ భజన చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా, అభివృద్ధికి అడ్డుపడ్డ బిజెపితో కలిసి వెళ్లడం సిగ్గుచేటు, తలవంపులు కాదా అని ప్రశ్నించారు. ఎవరిని ఉద్ధరించడానికి బిజెపితో కలిశారో సమాధానం చెప్పాలన్నారు. ముస్లిములకు నేనే రక్షణని చెబుతున్న చంద్రబాబు ఒకవైపు సిఎఎ చట్టాన్ని బిజెపి అమలు చేస్తుంటే తల ఊపుతున్నారని, రిజర్వేషన్లు వద్దంటే తల ఊపుతున్నారని అన్నారు. ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తే తరువాత దళితులు, మహిళలు అన్ని రకాల రిజర్వేషన్లు రద్దు చేయడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో బిజెపికి తొత్తుగా ఉన్న వైసిపి, టిడిపిని ఓడించాలని శ్రీనివాసరావు కోరారు.

➡️