VisakhaSteel: 16న బహిరంగ సభను విజయవంతం చేయాలి

Mar 14,2024 08:27 #Visakha, #visakha steel plant

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) : కాంగ్రెస్‌ ఆధ్వర్యాన ఈ నెల 16వ తేదీన ఉక్కునగరంలోని తృష్ణా మైదానంలో నిర్వహించే విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై డిక్లరేషన్‌ సభను విజయవంతం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి ఆదినారాయణ పిలుపునిచ్చారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ జిల్లా కూర్మన్నపాలెంలో చేపట్టిన రిలే దీక్షలు బుధవారం నాటికి 1126వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో స్టీల్‌ప్లాంట్‌ ఎల్‌ఎం, ఎస్‌బిఎం విభాగాల కార్మికులు కూర్చున్నారు. దీక్షలనుద్దేశించి ఆదినారాయణ మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌పై డిక్లరేషన్‌ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. కార్మికులకు రావలసిన ఆర్థిక ప్రయోజనాలను నెలల తరబడి తాత్సారం చేసినా కార్మికులు అంకితభావంతో పని చేస్తూనే ఉత్పత్తిని సాధి స్తున్నారని తెలిపారు. యాజమాన్యం కంపెనీని సమర్థవంతంగా నడపకుండా అధికారులు, కార్మికుల పట్ల భిన్నంగా వ్యవహరిస్తూ ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీస్తోందని, ఇది సమంజసం కాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి నరేంద్ర, ఎం త్రినాథ్‌, కె భాస్కర్‌ పి సీతారామరాజు, ఎల్‌వి రమణ, ఎ రాము, డి సత్యనారాయణ, బి నాగరాజు, మంగ వెంకటరావు పాల్గొన్నారు.

➡️