ఆస్తికోసం కన్నతల్లినే కడతేర్చిన కొడుకు..

Jan 7,2024 15:21 #crime

రామంతాపూర్‌ :అమ్మ కడుపునుంచి పేగు తెంచుకుని పుట్టిన కొడుకే తల్లిని ఆస్తి కోసం కడతేర్చిన ఘటన హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో జరిగింది. తల్లిపేరు మీద ఉన్న ఆస్తి కోసం తన భార్య, స్నేహితుడితో కలిసి కసాయి కొడుకు ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నటించాడు. అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో బంధువులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.సుగుణమ్మ తన కుమారుడు అనిల్‌, కోడలు తిరుమలతో కలిసి రామంతపూర్‌లో నివసిస్తోంది. సుగుణమ్మ పేరు మీద ఉన్న ఇంటిని కొడుకు, కోడలు అమ్మాలనుకున్నారు. కానీ సుగుణమ్మ అందుకు అంగీకరించలేదు. దీంతో కొడుకు తల్లిపై కక్ష పెంచుకున్నాడు. తల్లి ఆస్తిని ఎలాగైనా తీసుకోవాలి అనుకున్నాడు. కానీ దానికి తల్లి నిరాకరించడంతో ఆమెను చంపేందుకు భార్య, అతని స్నేహితుడితో ప్లాన్‌ వేశాడు. ముగ్గురు ఆస్తికోసం ఏకంగా తల్లినే హత్యచేసేందుకు ప్లాన్‌ వేసుకున్నారు. అయితే ఆ టైం రానే వచ్చింది. తల్లి సుగుణమ్మ ఇంట్లో ఉండగా బయట ఎవరూ లేని సమయం చూసి ముగ్గురు ఆమెపై దాడి చేశారు. అతి కిరాతకంగా హత్య చేశారు. ఏమీ తెలియనట్లు ఏడుస్తూ బయటకు వచ్చి సుగుణమ్మ చనిపోయిందంటూ నాటకం ఆడారు.అయితే అనిల్‌ ఏడుస్తూ తల్లి చనిపోయింది అంటూ అంత్యక్రియలను ఏమీ లేకుండా పూర్తి చేయాలని కంగారు పడటంపై బంధువులకు అనుమానం వచ్చింది. దీంతో బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటా హుటిని ఘటనా స్థలికి వచ్చిన పోలీసులు మఅతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. ఆరా తీయగా అసలు గుట్టు బయటపడింది. దీంతో.. మృతురాలి కుమారుడు, కోడలు సహా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

➡️