ప్రభుత్వం పగులకొడుతున్నది తాళాలు కాదు…అంగన్‌వాడీల గుండెలు

Dec 20,2023 09:18 #Anganwadi strike

 

-సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆగ్రహం

-వెంటనే సమస్యను పరిష్కరించాలని సూచన

-మహిళలతో పెట్టుకున్న ప్రభుత్వాలు గెలిచిన దాఖలా లేదు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ప్రభుత్వం పగులకొడుతున్నది అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు కాదని, కడుపుమండిన అంగన్‌వాడీ టీచర్లు, మినీవర్కర్లు, హెల్పర్ల గుండెలనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు, మంతెన సీతారాంతో కలిసి ఆయన మాట్లాడారు. 18వ తేదీన రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిందని, దీనికి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, ఎం.ఏ.బేబీ హాజరయ్యారని తెలిపారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. అంగన్‌వాడీల సమ్మెకు సిపిఎం సంపూర్ణ మద్దతు ప్రకటించిందని చెప్పారు. వారి సమస్యలను తక్షణం పరిష్కరించకపోతే ప్రభుత్వం మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. సమ్మెలో ఉన్న అంగన్‌వాడీలకు తల్లులు, ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రజాతంత్రవాదులు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. సమ్మె ఎనిమిది రోజులకు చేరిందని, సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణివల్లే రాష్ట్రంలో ఉన్న 55,605 అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడ్డాయని, లక్ష మంది పైగా అంగన్‌వాడీ మహిళలు వీధుల్లోకి వచ్చారని తెలిపారు. ప్రభుత్వం మొండి వైఖరితో దాదాపు 32 లక్షల మంది పేదగర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలుకు ఆటా పాటా, ఆహారం, ఆరోగ్యం దూరం చేస్తున్నారని విమర్శించారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని, అంగన్వాడీలకు కేంద్ర ప్రభుత్వం 2011 నుండి వేతనాలు పెంచలేదని, కనీసం రాష్ట్ర ప్రభుత్వమయినా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని కోరారు. వేతనం పెంచడానికి డబ్బు లేదంటున్న ప్రభుత్వం విశాఖ గెస్ట్‌హౌస్‌కు రూ.450 కోట్లు ఎలా ఖర్చు పెడుతుందని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు తదితర న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయాలని ఎనిమిది రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వమే జటిలంచేసే చర్యలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల ఈ కాలంలో గ్యాస్‌, నిత్యావసర సరుకులు, కరెంటు ఛార్జీలు, పెట్రోల్‌, డీజిల్‌ ఛార్జీలు విపరీతంగా పెరిగినా అంగన్‌వాడీల వేతనాలు పెరగలేదని తెలిపారు. 2019 ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రం కన్నా వెయ్యి ఎక్కువ ఇస్తానని జగన్‌ వాగ్దానం చేశారని, మేనిఫెస్టోలో కూడా పెట్టారని, దాన్నే అమలు చేయమని అంగన్‌వాడీ యూనియన్లు డిమాండ్‌ చేస్తున్నాయన్నారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా వేతనాలు పెంచాలని, ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని నాలుగు సంవత్సరాలుగా అనేకసార్లు ప్రభుత్వ అధికారులకు మంత్రులకు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చి దశలవారీగా అనేక ఆందోళనలు చేసినా ప్రభుత్వంలో ఏమాత్రమూ చలనం లేదని పేర్కొన్నారు. అనివార్యంగా డిసెంబర్‌ 12 నుండి రాష్ట్రంలో ఉన్న లక్ష మంది పైగా అంగన్‌వాడీలు తమ సెంటర్లను మూసేసి సమ్మె బాట పట్టారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా వెంటనే అంగన్వాడీ యూనియన్ల నాయకులను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని కోరారు. అంగన్‌వాడీలు దళిత, గిరిజన, బడుగు బలహీనవర్గాల పిల్లలకు సేవలు అందిస్తున్నారు. గర్భిణీ, బాలింతలకు ఆహారంతో పాటు ఆరోగ్య సలహా సేవలూ అందిస్తున్నారని వివరించారు. వారు సమ్మెలోకి వెళ్లడంతో గ్రామాల్లో పేదలు పనులకు వెళ్లడానికి కూడా పిల్లలను చూసుకునే వాళ్లు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఒకవైపు చర్చలకు ఆహ్వానిస్తూ రెండోవైపు ప్రభుత్వ అధికారులే అంగన్‌వాడీ సెంటర్ల తాళాలు పగలగొడుతున్నారని విమర్శించారు. అర్ధరాత్రి అపరాత్రులు లేకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తూ అంగన్‌వాడీలను అవమానిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ సమ్మె విరమించకపోతే విధులకు గైర్హాజరైనట్లుగా భావించి కలెక్టర్‌ చర్యలు తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించడం, అంగన్‌వాడీలకు ఒళ్లు బలిసి సమ్మెచేస్తున్నారని నోరు అదుపులేకుండా మాట్లాడిన బబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు, అంగన్‌వాడీలు ఆందోళన చేస్తున్న టెంట్లు పీకేయడం వంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడ్డ రైల్వేకోడూరు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇటువంటి చర్యలు పునరావృతమైతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అక్క చెల్లెమ్మలంటూ సమస్య పరిష్కారం చేయకుండా ప్రభుత్వమే కేంద్రాల తాళాలు పగలగొట్టడం, ప్రభుత్వ జులుం ప్రదర్శించడం, అన్ని డిపార్టుమెంట్ల వాళ్లని రంగంలోకి దించడం వల్ల మిగిలిన పనులన్నీ ఆగిపోయే ప్రమాదం ఏర్పడిందని తెలిపారు. ఒకశాఖ ఉద్యోగులకు వ్యతిరేకంగా మరోశాఖ వారిని ఉసిగొల్పడం దారుణమని చెప్పారు. మిగిలిన ప్రజలకు సేవలు అందించాల్సిన సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు, డ్వాక్రా మహిళలు, పోలీస్‌ యంత్రాంగం మొత్తం అంగన్‌వాడీ సెంటర్ల చుట్టూతిప్పటం వలన పరిపాలన స్తంభించే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. అంగన్‌వాడీి సెంటర్లు తెరవద్దని మద్దతు తెలియజేసిన లబ్ధిదారులకు రేషన్‌ కార్డులు కట్‌చేస్తాం, అమ్మఒడి, పెన్షన్‌ తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరించడాన్ని ఖండించారు. ఇప్పటికైనా బేషజాలంకు పోకుండా ఇచ్చిన హామీ మేరకు అంగన్‌వాడీల న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు.

 

 

➡️