ప్రచారానికి తెర…ప్రలోభాలకు ఎర

May 11,2024 18:45 #election

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో
సార్వత్రిక ఎన్నికలు చివరిదశకు వచ్చాయి. ఎన్నికల ప్రచారానికి తెరపడింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో నిగమ్నమయ్యాయి. రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్‌ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. వైసిపి అన్ని స్థానాల్లో పోటీచేస్తుండగా కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు పొత్తులతో సీట్లు సర్దుబాటు చేసుకుని ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. వైసిపితోపాటుగా తెలుగుదేశం, జనసేన, బిజెపి అభ్యర్థులు డబ్బు డబ్బులు గుమ్మరించి మరి పంపిణీచేస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యంత కీలకంగా మారిన మంగళగిరి నియోజకవర్గంలో ఇరుపార్టీల వారు రూ.5000 తగ్గకుండా ఒక్కో ఓటరుకు పంపిణీచేస్తున్నారు. టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్‌, వైసిపి తరపున మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కోడలు మురుగుడు లావణ్య నువ్వా, నేనా అన్నట్లుగా పోటీపడుతున్నారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పిఠాపురంలో పోటీచేస్తుండటంతో ఇక్కడ కూడా డబ్బు వరద పారిస్తున్నారు. ఇక్కడ వైసిపి అభ్యర్థిని వంగా గీత కూడా తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. సినీగ్లామర్‌ అంతా పవన్‌కళ్యాణ్‌కు వత్తాసుపలుకుతుండగా, గతంలో జెడ్పీచైర్‌పర్సన్‌గాను, ఎమ్మెల్యే, ఎంపిగా చేసిన సేవా కార్యక్రమాలే తనను గెలిపిస్తాయంటూ ఆమె ధీమా వ్యక్తంచేస్తున్నారు. కుప్పం, పులివెందుల, హిందూపురం, గన్నవరం, గుడివాడ, టెక్కలి తదితర అసెంబ్లీ స్థానాల్లో గెలుపుపై కూడా పందేలు కొనసాగుతున్నాయి. అనకాపల్లి, కడప పార్లమెంట్‌ స్థానాలపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి.

➡️