అంబేద్కర్‌ను అవమానించిన వారిని అరెస్ట్‌ చేయాలి

Jun 10,2024 21:47 #BR Ambedkar, #dhrana, #East Godavari, #KVPS
  • డిఆర్‌ఒకి వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్‌ వినతి

ప్రజాశక్తి – అమలాపురం, రాజమహేంద్రవరం : డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం ఎర్ర పోతవరం లాకుల వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించిన దోషులను వెంటనే అరెస్టు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కారెం వెంకటేశ్వరరావు, కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు శెట్టిబత్తుల తులసీరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు డిఆర్‌ఒ ఎం.వెంకటేశ్వరావుకు సోమవారం వినతిపత్రం అందజేశారు. అంబేద్కర్‌ విగ్రహాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ తొలుత గొల్లగూడెంలోని ప్రజా సంఘాల కార్యాలయం వద్ద సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. అంబేద్కర్‌ విగ్రహాలపై ఇలాంటి దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. రాజకీయ పార్టీల ముసుగులో అంబేద్కర్‌ విగ్రహాలను అవమానపరుస్తుంటే చూస్తూ ఊరుకోబోదని స్పష్టం చేశారు. పోలీస్‌ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి దోషులను అరెస్ట్‌ చేయాలని కోరారు.

రాజమహేంద్రవరంలో ధర్నా
అంబేద్కర్‌ విగ్రహానికి చెప్పుల దండ వేయాన్ని నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద కెవిపిఎస్‌ నాయకులు ధర్నా చేశారు. కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు మాట్లాడుతూ.. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిని ఏ పార్టీలోనూ కొనసాగనీయకుండా బహిష్కరించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. ధర్నాలో కెవిపిఎస్‌, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

➡️