ఉరుములు, మెరుపులతో వర్షం

Jun 16,2024 22:40 #gannavaram airport, #lightning, #Rain

– గన్నవరంలో గాల్లో చక్కర్లు కొట్టిన బెంగుళూరు విమానం
ప్రజాశక్తి – యంత్రాంగం :రుతుపవనాల ప్రభావంతో ఎన్‌టిఆర్‌, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. భారీ ఈదురుగాలులకు రహదారులపై చెట్లు విరిగిపడ్డాయి. పలుచోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. గన్నవరం విమానాశ్రయంలో ఈదురుగాలులకు బెంగుళూరు విమానం గంటపాటు గాల్లో చక్కర్లు కొట్టింది. తూర్పుగోదావరి జిల్లాలో పిడుగుపాటుకు రెండు మూగజీవాలు మృత్యువాతపడ్డాయి.
ఎన్‌టిఆర్‌ జిల్లా గన్నవరం విమనాశ్రయంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం సరిగాలేక బెంగళూరు విమానం సుమారు గంటపాటు గాల్లో చక్కర్లు కొట్టింది. బెంగళూరు నుంచి సాయంత్రం 6.20 గంటలకు గన్నవరం వచ్చిన విమానం ల్యాండింగ్‌కు అవకాశం లేకపోవడంతో 7.20 గంటల వరకు గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత విమానాశ్రయం నుంచి క్లియరెన్స్‌ రావడంతో ల్యాండ్‌ అయ్యింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత సేఫ్‌గా రన్‌వేపై దిగడంతో ఊపిరి పీల్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. గాలి వాన బీభత్సానికి చెట్లు విరిగి రోడ్డుపై పడడంతో గోపాలపురం నుంచి జగన్నాథపురం వరకు సుమారు పది కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌ స్తంభాలు విరిగి పడటంతో విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. గోపాలపురంలోని బిసి కాలనీలో పిడుగు పడటంతో మరీదు వెంకట దుర్గాప్రసాద్‌కు చెందిన రెండు చూడి గేదెలు మృత్యువాతపడ్డాయి.

➡️