నేడు బొగ్గుగనుల వేలం

Jun 21,2024 03:22
  • దేశవ్యాప్తంగా 60 గనుల గుర్తింపు
  • వేలంలో పాల్గొననున్న సింగరేణి
  • శ్రావణపల్లి బ్లాక్‌ను దక్కించుకునేందుకు యత్నాలు

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : హైదరాబాద్‌లో బొగ్గు గనుల వేలం శుక్రవారం నిర్వహించనున్నారు. ప్రతి ఏటా ఏదో ఒక నగరంలో బొగ్గు బ్లాకుల వేలం నిర్వహిస్తారు. మన రాష్ట్రానికి చెందిన కిషన్‌రెడ్డి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా ఉండటంతో 10వ రౌండ్‌ కమర్షియల్‌ మైనింగ్‌ వేలాన్ని ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 60 బొగ్గు బ్లాక్‌లను వేలం వేయనున్నారు. ఇందులో వివిధ రకాల కోకింగ్‌, నాన్‌-కోకింగ్‌ బొగ్గు గనులున్నాయి. వీటిలో 24 బొగ్గు గనులను పూర్తిగా అన్వేషించగా, 36 గనుల్లో పాక్షిక అన్వేషణ జరిగింది. రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా ఒడిశా 16, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో 15, జార్ఖండ్‌లో 6, పశ్చిమబెంగాల్‌, బీహార్‌లలో మూడేసి బొగ్గు బ్లాకులను గుర్తించారు. తెలంగాణ, మహారాష్ట్రలో ఒక బ్లాక్‌లను వేలం వేయనున్నారు. బొగ్గు రంగంలో పారదర్శకత, పోటీతత్వం, సుస్థిరతను పెంపొందించడానికి దోహదపడుతుందని అధికార బిజెపి అంటోంది. వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా ఉన్న ఈ బ్లాక్‌లు ప్రాంతీయ ఆర్థికాభివద్ధికి, ఉపాధి కల్పనకు దోహదం చేస్తాయని వాదిస్తోంది. అయితే ఈ వాదనను రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో పాటు బిఆర్‌ఎస్‌ మొదలగు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రం కార్పొరేట్లకు దేశ సంపదను దోచి పెట్టేందుకే వేలం అని విమర్శిస్తున్నాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం వేలంలో పాల్గొనేందుకు నిర్ణయించింది. బిడ్‌లో పాల్గొనకుంటే సింగరేణి కనుమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నది. గత బిఆర్‌ఎస్‌ సర్కార్‌ వేలానికి మద్దతు పలికిందని ఈ సందర్భంగా వాదిస్తోంది.

శ్రావణపల్లి కోసం సింగరేణి ప్రయత్నం
రాష్ట్రంలో గుర్తించి ఏకైక బొగ్గు బ్లాకైన శ్రావణపల్లిని దక్కించుకునేందుకు సింగరేణి ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు వేలంలో పాల్గొనేందుకు ఆ సంస్థ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. రాష్ట్రంలో సింగరేణి మొత్తం 40 గనుల్లో బొగ్గును వెలికి తీస్తోంది. 2030 కల్లా 22 గనులు మూతపడే అవకాశం ఉంది. ఇప్పుడున్న 70 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి 15 టన్నులకు పడిపోనుంది. కొత్త గనులు సంపాదించుకోక పోతే సింగరేణి చరిత్రలో కలిసి పోవడం ఖాయం. ఈ నేపథ్యంలో సంస్థను రక్షించుకునేందుకు 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలున్న రాష్ట్రంలోని శ్రావణపల్లి గనిని దక్కించుకునేందుకు సింగరేణి తనవంతుగా వేలంలో పాల్గొనేందుకు సిద్ధమైంది.

➡️