ఉద్యోగం పేరుతో రూ.20 కోట్లకు టోకరా

  • పోలీసులతో బెదిరింపులకు దిగిన కంపెనీ యాజమాన్యం
  •  బాధిత యువకుల ధర్నా

ప్రజాశక్తి- గన్నవరం (కృష్ణా జిల్లా) : ఉద్యోగాల పేరుతో తమ వద్ద డబ్బులు తీసుకుని మోసగించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలోని మేధా టవర్స్‌ ఎదుట హాలీవుడ్‌ కంపెనీ బాధితులు సోమవారం ఆందోళనకు దిగారు. కంపెనీ యాజమాన్యం న్యాయం చేయకపోగా వారిని నిర్బంధించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కంపెనీ యాజమాన్యానికి వత్తాసు పలికారు. ఇందుకు సంబంధించి బాధితుల కథనం ప్రకారం… హైదరాబాద్‌లోని రోటోమాక్‌ కంపెనీ… విఎఫ్‌ఎక్స్‌లో శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తామని ఒక్కొక్కరి వద్ద లక్ష రూపాయల నుండి రూ.1.50 లక్షల వరకు వసూలు చేసింది. వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది నుండి రూ.20 కోట్ల వరకు తీసుకుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 200 మంది యువకుల వద్ద రూ.2 కోట్ల వరకూ వసూలు చేసింది. శిక్షణ పూర్తి చేసుకున్న యువకుల్లో ఈ రాష్ట్రాలకు చెందిన 125 మందికి గన్నవరం మండలం కేసరపల్లిలోని మేధా టవర్స్‌లోగల హాలీవుడ్‌ కంపెనీలో గతేడాది జనవరిలో ఉద్యోగం ఇచ్చి నెలకు రూ.10 వేల చొప్పున వేతనం చెల్లించింది. గత ఆగస్టు తర్వాత అందరినీ ఈ కంపెనీ తొలగించింది. దీనిపై ప్రశ్నిస్తే… కంపెనీ నష్టాల్లో ఉందని, 2024 జనవరిలో మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటామని కంపెనీ ప్రతినిధులు నమ్మబలికారు. దీంతో, యువకులు తమ స్వగ్రామాలకు వెళ్లిపోయారు. అనంతరం జనవరి 20న హాలీవుడ్‌ కంపెనీ హెచ్‌ఒడిని వారు కలిశారు. అప్పటి నుండి కంపెనీ చుట్టూ తిరుగుతున్నా స్పందన లేదు. దీంతో, బాధిత యువకులు ఆ కంపెనీ వద్ద ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో కంపెనీ హెచ్‌ఒడి చర్చలకని పిలిచి వారిని ఒక గదిలో బంధించారు. అనంతరం గన్నవరం పోలీసులను ఫిర్యాదు చేశారు. గన్నవరం సిఐ ప్రసాద్‌ ఆ కంపెనీ వద్దకు వచ్చారు. బాధిత యువకులకు న్యాయం చేయకపోగా వారిని బెదిరించారు. కంపెనీ యాజమాన్యం చెప్పినట్లు వినాలని, లేదంటే కేసులు పెడతామని బెదిరించారు. ఏదైనా సమస్య ఉంటే రిపోర్టు రాసి ఇవ్వాలని ఉచిత సలహా ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో, కంపెనీ హెచ్‌ఒడి తీరును నిరసిస్తూ బాధిత యువకులు మేధా టవర్స్‌ మెయిన్‌ గేటు వద్ద మళ్లీ ఆందోళనకు దిగారు. అనంతరం గన్నవరం వెళ్లి సిఐకు ఫిర్యాదు చేశారు. తమను మోసగించిన కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని కోరారు.

➡️