అభివృద్ధిని ఓర్వలేక తప్పుడు ప్రచారం : అమర్‌నాథ్‌

Mar 13,2024 09:16 #Minister Gudivada Amarnath
Encouraging aspiring entrepreneurs: Minister Amarnath

ప్రజాశక్తి – రాజానగరం (తూర్పుగోదావరి జిల్లా) : వైసిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఐటి శాఖ మంత్రి అమర్‌నాథ్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని కలవచల్లలో ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థకు సంబంధించిన రూ.20.65 కోట్లతో నూతన పారిశ్రామిక వాడ పనులకు ఆయన మంగళవారం భూమి పూజ చేశారు. తొలుత వైసిపి జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మంత్రి అమర్నాథ్‌ మాట్లాడారు. కలవచర్లలో సుమారు ఐదు వేలు ఇండిస్టీస్‌ వస్తాయన్నారు. దీని వల్ల పరిసర గ్రామాల్లో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అడుగుతుంటే, పొత్తు ఉన్నాయని కాబట్టి ఓటు వేయాలంటూ చంద్రబాబు అడగడం సిగ్గుచేటన్నారు. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గంలో గ్లాస్‌ గుర్తు ఓటు వేయాలని, పార్లమెంటు నియోజకవర్గంలో పువ్వు గుర్తుకు ఓటు వేయాలని మాట్లాడే వారిని తరిమి కొట్టాలన్నారు. జోనల్‌ మేనేజర్‌ రమణారెడ్డి మాట్లాడుతూ ఈ పారిశ్రామిక వాడ సుమారు 104 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నామనానరు. ఐదు వేల మందికి ప్లాట్స్‌ కేటాయిస్తామన్నారు. రోడ్డు, డ్రెయినేజీ ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ గూడూరు శ్రీనివాస్‌, జడ్‌పిటిసి సభ్యులు వాసంశెట్టి పెద్ద, మండల కన్వీనర్‌ దూలం పెద్ద, ఎంపిపి గుర్రాల జ్యోత్స్న, పాల్గొన్నారు.

 

➡️