ఆందోళనకరంగా నిరుద్యోగం -ప్రముఖ ఆర్థికవేత్త ఎస్‌. మహేంద్రదేవ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో నిరుద్యోగం ఆందోళనకర స్థాయికి చేరిందని ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ ఎస్‌. మహేంద్రదేవ్‌ అన్నారు. సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసి ఆధ్వర్యంలో శనివారం విజయవాడలోని బాలోత్సవ్‌ భవనంలో ‘అభివృద్ధితో సంక్షేమాంసుపరిపాలనకు సవాళ్లు’ అనే అంశంపై చర్చా గోష్టి నిర్వహించారు. ఈసదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 30 శాతానికి పైగా నిరుద్యోగ యువత ఉన్నారని చెప్పారు. పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు పెరిగితేనే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. సమాజంలో అభివృద్ధి, ప్రగతిని సాధించటం ద్వారానే సంక్షేమాన్ని అమలు చేయగలమని చెప్పారు. అభివృద్ధికి తోడ్పడే సంక్షేమ పథకాలను అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో అప్పులు గణనీయంగా పెరిగిపోయాయని, బడ్జెట్‌ కేటాయింపుల్లో వేలాది కోట్లు కేవలం వడ్డీలు చెల్లించేందుకు వ్యయం చేయాల్సి వస్తోందని చెప్పారు. ప్రపంచ తలసరి ఆదాయంలో ఇండియా 130వ స్థానంలో ఉందని, దేశంలో ఒక్కశాతం ప్రజల దగ్గర 40 శాతం సంపద కేంద్రీకృతమవటం తీవ్ర అసమానతలకు దారితీస్తోందని ఆభిప్రాయపడ్డారు. మాజీ సిఎస్‌ ఎల్‌. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, వ్యక్తిగత ప్రయోజనాలకన్నా సమాజ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఎన్నికల సమయంలో రాజకీయ వైరుధ్యాలు ఉన్నా.. ఎన్నికల తర్వాత అంతా ఐక్యంగా అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. వలంటీర్ల వ్యవస్థ హానికరమైనదే కాకుండా చట్టవిరుద్ధమైనది, అనైతికమైనదని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ అన్నారు. వలంటీర్ల వ్యవస్థ వల్ల ఏటా దాదాపు రెండు వేల కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రజల నెత్తిపై పడిందని వివరించారు. సిటిజన్స్‌ ఫర్‌ డెమొక్రసి సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, విజయవాడ మాజీ మేయర్‌ జంధ్యాల శంకర్‌, జాస్తి వీరాంజనేయులు, గోళ్ల నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️