నౌకాదళం, సముద్ర భద్రతపై దృష్టి – కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) :సరిహద్దుల వద్ద శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పడంలో ఇప్పటికే విజయం సాధించామని, ప్రస్తుతం నౌకాదళం, సముద్ర భద్రతపై పూర్తి దృష్టి పెట్టామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. ఆయన రెండోసారి రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి శుక్రవారం భారత నావికాదళం కార్యాచరణ – సంసిద్ధతను సమీక్షించడానికి విశాఖలోని తూర్పు నౌకాదళ కమాండ్‌ను సందర్శించారు. ఐఎన్‌ఎస్‌ జలాశ్వలో నిర్వహించిన ‘డే ఎట్‌ సి’ కార్యక్రమంలో పాల్గన్నారు. వివిధ నౌకలు, జలాంతర్గాములు, విమానాల డైనమిక్‌ ఆపరేషన్లను వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరిహద్దులపై దృష్టి సారించి జాతీయ భద్రతను బలోపేతం చేయడమే తన పర్యటన ఉద్దేశమన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, సుదూర ప్రాంతాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించడం వంటిని లక్ష్యాలుగా చేరుకున్నామని వెల్లడించారు. తన రెండో విడత పదవీ కాలంలో సముద్ర భద్రతను మరింత బలోపేతం చేయనున్నట్టు తెలిపారు. భారత నౌకాదళం నిరంతరం బలపడుతోందని, షిప్‌యార్డులు విస్తరిస్తున్నాయని, విమాన వాహక నౌకలు పెరుగుతున్నాయని చెప్పారు. సన్‌ రైజ్‌ ఫ్లీట్‌ సిబ్బంది సంప్రదాయ బారాఖానాతో ‘డే ఎట్‌ సీ’ ముగిసింది. తొలుత విశాఖలోని ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకున్న రక్షణ మంత్రికి ఘన స్వాగతం లభించింది. మంత్రి వెంట నౌకాదళాధిపతి అడ్మిరల్‌ దినేష్‌ కె.త్రిపాఠి, తూర్పు నౌకాదళ కమాండ్‌ ఫ్లాగ్‌ ఆఫీసర్‌, కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ రాజేశ్‌ పెంధార్కర్‌ ఉన్నారు.

➡️