టిప్పర్‌ డ్రైవర్లకూ ‘వాహన మిత్ర’

  • దళితులంటే బాబుకు చిన్నచూపు
  • తొలి సంతకం వలంటీర్‌ వ్యవస్థపైనే
  •  మేమంతా సిద్ధం సభలో సిఎం

ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : మళ్లీ అధికారంలోకి రాగానే టిప్పర్‌ డ్రైవర్లకు వాహన మిత్ర ద్వారా ప్రతి సంవత్సరం రూ.పదివేలు సాయం అందిస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. స్వయం ఉపాధికారులుగా జీవిస్తున్న డ్రైవర్లకు ఆటోలు, టాక్సీలు, లారీలు, టిప్పర్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం, బ్యాంకుల నుంచి రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. తమ సొంత కాళ్లపై నిలబడి కుటుంబాలను పోషించుకుంటున్న డ్రైవరన్నలకు అండగా నిలబడుతున్న ఏకైక ప్రభుత్వం వైసిపి అని అన్నారు. ‘మేమంతా సిద్ధం’ యాత్ర ఎనిమిదో రోజు గురువారం రేణిగుంట మండలం గురవరాజుపల్లి నుంచి మల్లవరం, ఏర్పేడు, పనగల్లు, శ్రీకాళహస్తి బైపాస్‌ మీదుగా చిన్నసింగమల వరకు సాగింది.
తొట్టంబేడు మండలం చిన్నసంగమల సమీపంలో లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లతో ముఖాముఖి నిర్వహించారు. డ్రైవర్ల సమస్యలను సిఎం అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,93,655 మంది వివిధ రంగాల్లో ఉన్న డ్రైవరన్నలకు వాహన మిత్ర పథకం ద్వారా ఏడాదికి రూ.పది వేలు చొప్పున ఐదేళ్లకు గాను అక్షరాలా రూ.12.96 కోట్ల సాయం అందించామని చెప్పారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 18 వేల మంది డ్రైవర్ల కుటుంబాలకు రూ.61 కోట్లు అందజేశామని తెలిపారు. తాము చదువుకున్న చదువులకు చంద్రబాబు ప్రభుత్వంలో ప్రభుత్వ కొలువులు రాక శింగనమల వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు లాంటి ఎంతో మంది యువత తమ సొంత కాళ్లపై నిలబడేందుకు డ్రైవర్లుగా మారారని గుర్తు చేశారు. డ్రైవర్లు కూడా చట్టసభలకు వెళ్లాలనే గొప్ప లక్ష్యంతో తమ పార్టీ శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరాంజనేయులకు టికెట్టు ఇవ్వడం జరిగిందని. అయితే దీనిని అభినందించాల్సింది పోయి చంద్రబాబు స్థాయి వ్యక్తి టిప్పర్‌ డ్రైవర్‌ వేలిముద్ర గాడంటూ పరుషంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. డ్రైవర్లన్నా, దళితులన్నా ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చిన్న చూపని విమర్శించారు. వాస్తవానికి చంద్రబాబు కన్నా వీరాంజనేయులు ఎక్కువే చదివారనీ, రాష్ట్రంలోని డ్రైవర్లందరి ప్రతినిధిగా వైసిపి తరపున టికెట్టు ఇవ్వడం గర్వించదగ్గ విషయమన్నారు. అనంతరం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ‘రాష్ట్రంలో 66 లక్షల మంది పింఛన్లు అందుకుంటున్నారు. జూన్‌ నాలుగు వరకు ఓపిక పట్టండి. మళ్లీ మన ప్రభుత్వమే రాబోతోంది. తొలి సంతకం వలంటీర్‌ వ్యవస్థపైనే చేసి.. పింఛన్ల పంపిణీ కొనసాగిస్తాం’ అని ప్రకటించారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత తమకే దక్కిందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించి 175కు 175 సీట్లు తప్పకుండా గెలుస్తామని ఉద్ఘాటించారు. మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి గురుమూర్తి, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి, ఉన్నం వాసుదేవ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️