వైవిధ్యమైన కవిత్వశిల్పం “బాల్యమే శరణార్ది”

  • సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్

ప్రజాశక్తి-కర్నులు : వైవిధ్యమైన కవిత్వశిల్పం ‘‘బాల్యమే శరణార్ది’’ కవిత్వమని సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్ అన్నారు. ఉద్యోగ క్రాంతి ప్రచురణల ఆధ్వర్యంలో కవి కె.రత్నం యేసేపు రాసిన కవిత్వం బాల్యమే శరణార్ది ఆవిష్కరణ సభ నగరంలోని లలిత కళా సమితిలో జరిగింది. సభాధ్యక్షులుగా కె యన్ పీ యస్ జిల్లా అధ్యక్షులు సుబ్బారాయుడు అధ్యక్షత వహించారు. ఆవిష్కర్త మాట్లాడుతూ.. ప్రపంచంలో ఏం జరుగుతుందో అన్న విషయాన్ని చాలా స్పష్టంగా..సమాజం పట్ల ఎంతో బాధ్యతగా ఈకవిత్వం రాశారని వొక్కొక్క విషయాన్ని చెబుతూ కవిత్వీకరిస్తూ వచ్చాడన్నారు. మనిషిని, సమాజాన్ని చదవలేని జ్ఞానం.. విజ్ఞానం కాదు అజ్ఞానమని మనిషిలోని మనస్సుని, మానవీయతను వెలికి తీయని పాఠం శాస్త్రీయం కాదని చెప్పాడన్నారు. సామాజిక స్పృహ లేని టీచర్లు ఈ సమాజంలో ఉన్నారని చెబుతూనే పిల్లలు ఈ సమాజంలో బతకగలిగే పాఠాలు నేర్పేవాళ్ళు కావాలంటాడన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1వతరగతి నుండి తెలుగు భాషామాధ్యమాన్ని రద్దుచేసిన సందర్భంగా రాసిన కవితలో ..తల్లి భాష కావాలని చిన్నారి శంభూకులు నినదిస్తే

తలనరకడానికి రాముడు అవసరంలేదు
నేటి ఏలికలు చాలు తల్లీ అంటూ.. అమ్మభాష కవితలో చెప్తాడని ఇలాంటి గొప్ప కవిత్వం ఈ సంపుటిలో ఉందన్నారు. విరసం రాష్ట్ర నాయకులు పాణి మాట్లాడుతూ విద్యారంగంలో మనదేశంలో ఎలా ప్రమాదంలో ఉందో కవి తన కవిత్వంలో ఆవేదనగా చెప్తాడని అలా రాయడానికి విద్య అన్నది మనదేశంలో సార్వత్రికం కాకకపోవడం విద్య ప్రపంచ విధానాలకు అనుగుణంగా లేకపోవడం విషాదమన్నారు.అసలు మన దేశానికి నిర్ధిష్టమైన శాస్త్రీయమైన విద్యావిధానం లేకపోవడం మరింత విచారకరమన్నారు. ఇంకా ఈ కవిత్వ సంపుటిలో ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన చారిత్రక రైతు ఉద్యమం మీద..ప్రస్తుతం జరగుతున్న పాలస్తీనా `ఇజ్రాయిల్‌ యుద్దం మీద బలమైన కవితలున్నాయని ప్రపంచంవ్యాప్త పరిణామాల్ని ఈ కవి చరిత్రలో రికార్డు చేసే పనిలో ఈ కవిత్వం ద్వారా కవి రత్నం యేసేపు సఫలీకృతుడయ్యాడనిపించిందని, వర్తమాన సాహిత్య సమాజానికి అవసరమైన కవిత్వం “బాల్యం శరణార్ది” అన్నారు. కవి రత్నం యేసేపు తన స్పందన తెలియజేశారు. సమావేశం లో విరసం నాయకులు నాగేశ్వరాచారి, సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల చక్రపాణి యాదవ్ ఆద్య మెడికల్ అధినేత ఏ వి రెడ్డి, యూ టి ఎఫ్ జిల్లా నాయకులు రాములు, రాయలసీమ మేధావుల సంఘం నాయకులు రవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

➡️