స్వగ్రామాలకు వీరజవాన్ల భౌతికకాయాలు

  • సైనిక, పోలీస్‌ లాంఛన్లతో ఇద్దరి అంత్యక్రియలు పూర్తి

ప్రజాశక్తి- యంత్రాంగం : జమ్మూకాశ్మీర్‌లోని లద్దాక్‌ వద్ద నది దాటే ప్రయత్నంలో జరిగిన ప్రమాదంలో వీర మరణం పొందిన మన రాష్ట్రానికి చెందిన ముగ్గురు సైనికుల భౌతికకాయాలను సైనిక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి మిలటరీ అధికారులు సోమవారం తీసుకొచ్చారు. అక్కడి నుంచి మృతదేహాలను స్వగ్రామాలకు తరలించారు. అనంతరం సైనిక, పోలీసు లాంఛనాలతో స్వగ్రామాల్లో వారిలో ఇద్దరి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లె గ్రామానికి చెందిన జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి (జెఇఒ) ముత్తుముల రామకృష్ణారెడ్డి (47), కృష్ణా జిల్లా పెడన మండలం చేవెండ్రకు చెందిన సాగరబోయిన నాగరాజు (32), బాపట్ల జిల్లా రేపల్లె మండలం కైతేపల్లి పంచాయతీ ఇస్లాంపూర్‌ గ్రామానికి చెందిన శుభాన్‌ ఖాన్‌ (40) భౌతికకాయాలను అధికారిక లాంఛనాలతో గన్నవరం విమానాశ్రయం నుంచి స్వగ్రామాలకు తరలించారు. వీర జవాన్లకు మిలటరీ అధికారులు రెడ్‌ సెల్యూట్‌ చేశారు. వాస్తవాధీన రేఖ సమీపంలో టి-72 యుద్ధ ట్యాంకులో వెళ్తున్నప్పుడు లేహక్‌కు 148 కిలోమీటర్ల దూరంలో ఈ ముగ్గురు జవాన్లు ప్రయాణిస్తున్న ట్యాంక్‌ శ్యోక్‌ నదిలో కొట్టుకుపోయింది. మంచు కరిగిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
నాగరాజుకు ఐదేళ్ల కిందట వివాహమైంది. ఏడాది పాప ఉంది. నాగరాజు సోదరుడు శివయ్య కూడా సైనికుడిగా సేవలందిస్తున్నారు. నాలుగు రోజుల కిందట కుమార్తె పుట్టిన రోజు వేడుకలను వీడియో కాల్‌లో నాగరాజు చూసి కుటుంబసభ్యులతో ఉల్లాసంగా గడిపారు. అంతలోనే దుర్మరణం చెందడంతో కుటుంబం కన్నీరుమున్నీరైంది. సుభాన్‌ ఖాన్‌ 17 ఏళ్ల కిందట సైనికుడిగా చేరి అంచెలంచెలుగా హవల్దార్‌ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఇఎంఇ మెకానిల్‌ విభాగంలో పనిచేస్తున్నారు. రెండేళ్లలో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా వీరమరణం చెరదడంతో స్వగ్రామం కైతేపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. జులై 7న స్వగ్రామానికి వచ్చేందుకు విమానం టికెట్‌ బుక్‌ చేసుకున్నారు. ఇంతలో విషాదం చోటుచేసుకుంది. ఇస్లాంపూర్‌లో సుమారు వంద ఇళ్లు ఉండగా దాదాపు ప్రతి ఇంటి నుంచి ఇద్దరు సైనికులుగా ఎంపికయ్యారు. వీరిలో కొందరు పదవీ విరమణ చేశారు. నాగరాజు, సుభాన్‌ ఖాన్‌ అంత్యక్రియలు సైనిక, పోలీస్‌ లాంఛనాలతో పూర్తయ్యాయి.

నేడు రామకృష్ణారెడ్డి అంత్యక్రియలు
రామకృష్ణారెడ్డి ఏడు నెలల్లో రిటైర్డ్‌ కానుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన తండ్రి రామస్వామిరెడ్డి ఆర్మీ జవాన్‌గా పనిచేసి రిటైరయ్యారు. రామకృష్ణారెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రిటైర్‌మెంట్‌ అనంతరం నివాసం ఉండేందుకు కాల్వపల్లెలో నూతన గృహాన్ని నిర్మించుకున్నారు. గృహప్రవేశం జరగకుండానే వీరమరణం పొందడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతి చెందారు. మంగళవారం ఉదయం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.

➡️