పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుపై నేడు తీర్పు

Jun 1,2024 08:57 #counting, #Postal ballot

– వైసిపి పిటిషన్‌పై ముగిసిన వాదనలు
ప్రజాశక్తి-అమరావతి :పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు చేసేటప్పుడు ఓటరు డిక్లరేషన్‌కు చెందిన ఫామ్‌-13ఏ’పై అటెస్టింగ్‌ అధికారి పేరు, హోదా, సీలు లేకపోయినా అనుమతించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను హైకోర్టులో వైసిపి సవాల్‌ చేసింది. దీనిని శుక్రవారం హెకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ మండవ కిరణ్మయి ప్రతాప, జస్టిస్‌ న్యాపతి విజరులతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో శనివారం సాయంత్రం 6 గంటలకు తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ప్రకటించింది.
ఫారమ్‌-13ఏపై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉంటే చాలని, పేరు, హోదా, సీలు లేకపోయినా పోస్టల్‌ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చంటూ మే 30న కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ వైసిపి ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అత్యవసర పిటిషన్‌ దాఖలు లచేశారు. ఆయన తరపున సీనియర్‌ అడ్వకేట్స్‌ అభిషేక్‌ సింఘ్వీ (సుప్రీంకోర్టు), పి వీరారెడ్డి వాదిస్తూ, ఎపిలో సుమారు 5.5 లక్షలకు పైగా పోస్టల్‌ బ్యాలెట్లు గెలుపోటములను నిర్ణయిస్తాయని, వీటికి సంబంధించిన మార్గదర్శకాల మార్పును రద్దు చేయాలని కోరారు. ఎపిలో మాత్రమే ఈ తరహా ఉత్తర్వులు జారీ చేయడం దారుణమన్నారు. ఎన్నికల్లో చెల్లని ఓట్లను లెక్కింపులో పరిగణనలోకి తీసుకునేలా ఇసి ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అటెస్టింగ్‌ అధికారి సంతకం సరిపోతుందన్న ఇసి నిర్ణయాన్ని కొట్టేయాలని కోరారు.
ఇసి తరపున సీనియర్‌ న్యాయవాది అవినాష్‌ దేశారు ప్రతివాదన చేస్తూ, ఎన్నికల విధుల్లో ఉండి ఫెసిలిటేషన్‌ కేంద్రాల వద్ద పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓట్లు వేసిన ఉద్యోగులకు మాత్రమే 30న జారీ చేసిన ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయన్నారు. ఫెసిలిటేషన్‌ కేంద్రాల వద్ద ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వినియోగ హక్కు గతేడాది ఆగస్టులో నిబంధన 18(ఏ) అమల్లోకి వచ్చిందన్నారు. అలాంటి కేంద్రాల వద్ద అటెస్టింగ్‌ ఆఫీసర్‌ను రిటర్నింగ్‌ అధికారే నియమించారని చెప్పారు. ఫారం-13ఏపై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని వివరించారు. ఫెసిలిటేషన్‌ కేంద్రాల వద్ద జరిగిన పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ అంతా వీడియో రికార్డింగ్‌ జరిగిందన్నారు. ఇదే కేసులో టిడిపి నేత వెలగపూడి రామకృష్ణబాబు ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదిస్తూ, ఇసి నిర్ణయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో హైకోర్టు తమ నిర్ణయాన్ని శనివారం 6 గంటలకు వెలువరిస్తామని ప్రకటించింది.

➡️