బేరింగ్‌ పాడవ్వడం వల్లే వైబ్రేషన్స్‌

  •  సాంకేతిక నిపుణుల సూచనలతో మార్పు చేస్తాం : ప్రద్యుమ్న

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గోదావరి నదిపై నిర్మించిన గామన్‌ బ్రిడ్జి 56-57 మధ్య స్పాన్‌ వద్ద బేరింగ్‌ పాడవ్వడం వల్ల వైబ్రేషన్స్‌ వచ్చాయని, సాంకేతిక నిపుణుల సూచనల మేరకు వాటిని మార్పు చేస్తామని రాష్ట్ర రవాణా, రోడ్లు భవనాల ముఖ్య కార్యదర్శి పిఎస్‌.ప్రద్యుమ్న తెలిపారు. సోమవారం సాయంత్రం సాంకేతిక నిపుణుల బృందంతో కలిసి ఆయన గామన్‌ బ్రిడ్జిని పరిశీలించారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ప్రద్యుమ్న మాట్లాడుతూ.. సాంకేతిక పరమైన లోపాన్ని బ్రిడ్జి నిర్వహణ సంస్థ గుర్తించిందన్నారు. బేరింగ్‌లు దెబ్బతినడం వల్ల వైబ్రేషన్స్‌ పెరిగినట్టు గుర్తించారని తెలిపారు. వంతెన భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేదనీ స్పష్టం చేశారు. బేరింగ్‌ అందుబాటులో ఉంటే నాలుగైదు రోజుల్లోనే అమరుస్తారని, లేకుంటే ఈ వంతెనకు అనుగుణంగా బేరింగ్‌ను తయారు చేయాల్సి ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో వైబ్రేషన్స్‌ వస్తున్న ప్రాంతాన్ని పరిశీలించామని తెలిపారు. కలెక్టర్‌ కె.మాధవీలత, ఎస్‌పి పి.జగదీష్‌, రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎల్‌.శ్రీనివాసరెడ్డి,ఆర్‌ అండ్‌ బి ఎస్‌ఇ తదితరులు పాల్గొన్నారు.

➡️