గవర్నర్‌ ఎదుటే అభ్యంతర పదజాలం : నోటిదురుసు ప్రదర్శించిన అధికారపక్షం

Feb 6,2024 10:34 #Governor, #manner, #Vocabulary

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్‌ సాక్షిగా అధికారపక్ష సభ్యులు ప్రతిపక్ష సభ్యులపై దూషణలకు దిగారు. ఒకవైపు గవర్నర్‌ ప్రసంగిస్తుండగానే అధికారపక్ష సభ్యులు ‘అరేయ్ ..ఒరేయ్ ..పోరా’ అంటూ ప్రతిపక్షసభ్యులను ద్ధేశించి అభ్యంతర పదజాలాన్ని వాడటం వినిపించింది. ప్రసంగపాఠం లోని 41వ అంశాన్ని గవర్నర్‌ చదువుతున్న సమయంలో టిడిపి సభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు తదితరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసమయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బి.మధుసూదనరెడ్డి పెద్దగా అరుస్తూ అభ్యంతర పదాలు వాడటం వినిపించింది. అంగన్‌వాడీలకు న్యాయం చేయాలని బుచ్చియ్యచౌదరి నినాదాలు చేస్తున్న సమయంలోనూ ఆయన ఇదే విధంగా స్పందించారు. గవర్నర్‌ 70 అంశం చదువుతున్న సమయంలో టిడిపి సభ్యులు లేచి నిరసన వ్యక్తం చేశారు. జాబ్‌ క్యాలెండర్‌ లేదని, ప్రత్యేక హోదా తేలేకపోయారని, పోలవరం పూర్తి చేయలేదని, అంగన్‌వాడీలను మోసం చేశారని నినాదాలు చేశారు. జగన్‌కు ఇవే చివరి సమావేశాలు అంటూ బైబై అని ప్రచురించిన ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రతిగా అధికారపక్ష సభ్యులు జై జగన్‌ అంటూ నినాదాలు చేశారు ఈ సమయంలో కూడా అధికారపక్షం నుండి ఒకరిద్దరు సభ్యులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం వినిపించింది. ఈ గందరగోళం అరుపులు కేకల మధ్య గవర్నర్‌ ఒక నిముషం తన ప్రసంగాన్ని ఆపారు. అనంతరం కొనసాగించారు.

➡️