విఆర్‌కు ఇద్దరు కానిస్టేబుళ్లు

May 25,2024 23:20 #allu arjun, #police case

ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌ : అల్లు అర్జున్‌ నంద్యాలకు వస్తున్నారన్న విషయాన్ని ముందుగా జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాకపోవడంపై జిల్లా ఎస్‌పి రఘువీర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో పని చేస్తున్న స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీస్‌ నాగరాజు, టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో పని చేస్తున్న స్వామి నాయక్‌ను విధుల నుండి తప్పిస్తూ జిల్లా ఎస్‌పి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 11న వైసిపి నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవికి సంఘీభావం తెలపడానికి అల్లు అర్జున్‌ నంద్యాలకు వచ్చారు. ఎన్నికల ప్రవర్తనా నియామవాళిని ఉల్లంఘిస్తూ ఎమ్మెల్యే ఇంటి వరకు రోడ్డు షో నిర్వహించారు. రోడ్‌ షోకు పోలీసుల అనుమతి తీసుకోకపోవడం, అయినా పోలీసులు భద్రత కల్పించడం, అధిక సంఖ్యలో జనాలు గుమ్మిగూడటం పట్ల కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌ అయిన విషయం తెలిసిందే. ఎస్‌పి, డిఎస్‌పి, టూ టౌన్‌ సిఐపై ఛార్జ్‌షీట్‌ నమోదు చేయాలని అప్పట్లో ఆదేశించింది. అయితే, నిఘా విభాగం స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు ముందు రోజే అల్లు అర్జున్‌ నంద్యాలకు వస్తున్నట్లు ఉన్నతధికారుల దృష్టికి తీసుకురాకపోవడం వల్లనే సమస్యలు వచ్చాయని గ్రహించిన పోలీస్‌ బాస్‌ వారి ఇరువురిపై చర్యలపై తీసుకుంటూ విఆర్‌కు పంపారు.

➡️