11వ పిఆర్‌సి ప్రకారం వేతన సవరణ :  ఎవి నాగేశ్వరరావు డిమాండ్‌

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : డిఎస్‌సి కాంట్రాక్టు పారా మెడికల్‌ ఉద్యోగులకు 100 శాతం గ్రాస్‌ శాలరీ, డిఎ, హెచ్‌ఆర్‌ఎలను కొనసాగిస్తూ 11వ పిఆర్‌సి ప్రకారం వేతన సవరణ చేయాలని యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయన లేఖ రాశారు. దాదాపు 20 ఏళ్లుగా పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులరైజ్‌ చేయాలని, పారా మెడికల్‌ ఉద్యోగులకు గతంలో వలే గ్రాస్‌ శాలరీ అమలు చేయాలని సిఎస్‌ను కోరారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను కొనసాగించేలా వెంటనే ఉత్తర్వులివ్వాలని ప్రభుత్వాన్ని స్టేట్‌ గవర్నమెంట్‌ కాంట్రాక్టు అండ్‌ అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌, టీచర్స్‌ అండ్‌ వర్కర్స్‌ జెఎసి డిమాండ్‌ చేసింది. డిసెంబరు 31 నాటికి అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఈ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని జెఎసి సిఎస్‌ను కోరింది. అలాగే వీరికి రిటైర్మెంటు వయసు 62 ఏళ్లకు పెంచాలని, సాధారణ, అనారోగ్య సెలవులూ మంజూరు చేయాలని డిమాండ్‌ చేసింది.

➡️